మీకు మాత్రమే చెప్తా : రివ్యూ

November 01, 2019
img

హీరోగా మంచి ఫాంలో ఉన్న విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి చేసిన తొలి ప్రయత్నం మీకు మాత్రమే చెప్తా. షమ్మీర్ సుల్తాన్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో డైరక్టర్ తరుణ్ భాస్కర్ హీరోగా నటించడం విశేషం. తరుణ్ భాస్కర్, అభినవ్ గోమఠం, వాణి భోజన్, అనసూయ వంటి స్టార్ కాస్ట్ తో ఈ సినిమా వచ్చింది. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ : 

ఓ ఛానెల్ లో యాంకర్ కమ్ ప్రోగ్రాం డైరక్టర్ గా పనిచేస్తుంటాడు రాకేష్ (తరుణ్ భాస్కర్). అయితే రాకేష్ డాక్టర్ అయిన స్టేఫీ (వాణి భోజన్) ను ప్రేమిస్తాడు. అప్పటికే ఆమెకు తనకు ఎలాంటి అలవాట్లు లేవని బిల్డప్ ఇచ్చిన రాకేష్ అనుకోకుండా అతని ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదే టైంలో రాకేష్, స్టేఫీల పెళ్లికి ఏర్పాట్లు జరుగుతాయి. ఆ వీడియోని సర్వర్ నుండి డిలీట్ చేసే ప్రయత్నాలు చేస్తాడు రాకేష్. మరి రాకేష్ అసలు ఎందుకు అలా ఇరుక్కోవాల్సి వచ్చింది..? స్టేఫీకి రాకేష్ గురించి నిజం తెలిసిందా..? రాకేష్ స్టేఫీల రిలేషన్ ఏమైంది అన్నది సినిమా కథ.   

విశ్లేషణ :

అనుకోకుండా తీసిన ఓ వీడియో తనకు తెలియకుండానే సోషల్ మీడియాలో వైరల్ అయితే ఎలా ఉంటుందో చెప్పే కథతో వచ్చిన సినిమా మీకు మాత్రమే చెప్త. విజయ్ దేవరకొండ నిర్మించిన ఈ సినిమాలో తరుణ్ భాస్కర్, వాణి భోజన్ లు జంటగా నటించారు. సినిమా కథ చాలా సింపుల్ గా ఉన్నా హ్యూమర్ తో సినిమా నడిపించారు. సినిమాలో అక్కడక్కడ సీన్స్ బాగా నవ్విస్తాయి.

ముఖ్యంగా తరుణ్ భాస్కర్, అభినవ్ ల మధ్య వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి. ఇక సినిమాలో కామెడీ హైలెట్ కాగా అక్కడక్కడ రిపీటెడ్ సీన్స్ వచ్చినట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అంతా ఎంటర్టైనింగ్ అనిపించగా సెకండ్ హాఫ్ కొద్దిగా సాగదీసినట్టు అనిపిస్తుంది. దర్శకుడు రాసుకున్న కథను సినిమాగా మలచడంలో కొంత సాగదీసినట్టు అనిపిస్తుంది.

అయితే సినిమా ఎక్కడ బోర్ అన్న ఫీలింగ్ రాదు. ఫ్యామిలీ, యూత్ ఆడియెన్స్ అందరిని మెప్పించేలా సినిమా ఉంటుంది. అయితే కథనం ఇంకాస్త బాగా రాసుకుని ఉంటే బాగుండేది. డైలాగ్స్, పంచులు అలరించాయి. సినిమాలో తరుణ్, అభినవ్ ల మధ్య కామెడీ అలరించింది. 

నటన, సాంకేతికవర్గం :

డైరక్టర్ గా సత్తా చాటిన తరుణ్ భాస్కర్ హీరోగా మారడం షాక్ అని చెప్పొచ్చు. అయితే రాకేష్ పాత్రలో తరుణ్ భాస్కర్ మాత్రం అదరగొట్టాడు. తన మార్క్ నటనతో తనకంటూ ఓ స్టైల్ ఉందని ప్రూవ్ చేసుకున్నాడు. ఫలక్ నుమా దాస్ లోనే అతని యాక్టింగ్ టాలెంట్ అర్ధమవుతుంది. ఈ సినిమా ఫుల్ లెంగ్త్ రోల్ లో ఫుల్ టైం యాక్టర్ గానే మెప్పించాడు. ఇక తరుణ్ భాస్కర్ లానే అభినవ్ కూడా తన కామెడీ టైమింగ్ తో అలరించాడు. వాణి భోజన్ కూడా అలరించింది. అనసూయ, అవంతిక, పావని, వినయ్ వర్మ ఇలా అందరు తమ పాత్రలకు న్యాయం చేశారు.

ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే.. మధన్ సినిమాటోగ్రఫీ ఓకే అనిపిస్తుంది. శివ కుమార్ సంగీతం సినిమాకు తగినట్టుగానే ఉంది. దర్శకుడు షమ్మీర్ సుల్తాన్ కథ, కథనాల్లో తన ప్రతిభ చూపించాడు. సెకండ్ హాఫ్ ఇంకాస్త స్క్రీన్ ప్లే బాగుంటే వేరేలా ఉండేది. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ అయితే నామమాత్రంగానే ఉన్నాయి. విజయ్ తక్కువ బడ్జెట్ తో ఈ సినిమా తీశాడని తెలుస్తుంది.

ఒక్కమాటలో :

మీకు మాత్రమే చెప్తా.. ఒక్కసారి చూసేయొచ్చు..!

రేటింగ్ : 3/5



Related Post