మల్లేశం : రివ్యూ

June 21, 2019
img

చింతకింది మల్లేశం ఆసు యంత్రంతో ఈనో చేనేత కుటుంబాల్లో వెలుగులు నింపిన వ్యక్తి. 6వ తరగతి వరకే చదువుకున్న అతను తల్లి కష్టాన్ని చూడలేక ఆసు యంత్రాన్ని కనిపెట్టాడు. ఆయన జీవితంతో తెరకెక్కిన సినిమా మల్లేశం. మల్లేశం సినిమా ఓ సినిమా కథ కాదు ఓ జీవితం.. మనిషి నిస్వార్ధంతో ప్రయత్నిస్తే ఎలాంటి లక్ష్యన్నైనా సాధించవచ్చు అని చెప్పే కథ.. ఇది మన కథ.. మన తెలంగాణా వ్యక్తి స్పూర్తి కథ.       

కథ :

నల్లగొండ జిల్లా శారాజిపేటలో చేనేత వృత్తే జీవనాధారం. మల్లేశం కుటుంబం కూడా చేనేత వృత్తి మీదే జీవనం సాగిస్తుంది. ఆరోతరగతికే చదువు మానేసిన మల్లేశం మగ్గం పని చేస్తుంటాడు. తల్లి ఆసుపోస్తూ పడే రెక్కల కష్టాన్ని చూసి చలించిపోతాడు. ఆసు పోయడం వల్ల ఆమె భుజం ఎముక కరిగిపోతుంది. ఆసు పోయడం ఆపకపోతే భుజం పనిచేయదని డాక్టర్ చెబుతాడు. అలాంటి టైంలో ఆసు యంత్రం కనిపెట్టాలని అనుకుంటాడు మల్లేశం. ఈ క్రమంలో మల్లేశం ఎన్ని కష్టాలు పడ్డాడు..? చివరకు మళ్లేశం అనుకున్నది ఎలా సాధించాడు..? అతనికి ఎదురైన అవమానాలు ఏంటన్నది సినిమాలో చూడాల్సిందే.

విశ్లేషణ :

రాసిన కథ సినిమాగా తెరకెక్కించడం వేరు.. ఆల్రెడీ జరిగిన కథ.. జీవిత కథను సినిమాగా తీర్చిదిద్దడం వేరు. మల్లేశం ఇది తెలంగాణా స్పూర్తి కథ.. 6వ తరగతిలో చదువు మానేసిన ఓ వ్యక్తి ఆసు యంత్రం కనిపెడతాడా అని జగమంతా ముక్కున వేలేసుకునేలా చేసిన కథ. దర్శకుడు రాజ్ ఆర్ సినిమాను ఎంతో అందంగా తెరకెక్కించాడు. తెలంగాణా జీవన విధానం, యాస, సంసృతి సంప్రదాయాలను కూడా సినిమాలో పొందుపరిచాడు.     

ఆసు యంత్రాన్ని కనిపెట్టడానికి మల్లేశం పడిన కష్టాన్ని అద్భుతంగా చూపించారు. సినిమా వాస్తవికతకు చాలా దగ్గరగా తీసినట్టు అనిపిస్తుంది. కొన్ని చోట్ల సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా సాధ్యమైనంత వరకు చాలా నాచురల్ గా తీశాడు. మొదటి భాగం మొత్తం కొంచం ఎమోషనల్, కామెడీ మిక్స్ చేసిన దర్శకుడు సెకండ్ హాఫ్ పూర్తిగా ఎమోషనల్ గా సాగించాడు. 

స్పూర్తిదాయకమైన ఈ కథను ప్రేక్షకులను మెప్పించేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు రాజ్ ఆర్. కాస్ట్ అండ్ క్రూ కూడా బాగా కుదిరింది. సినిమా అన్ని అంశాల్లో అలరించింది. అయితే క్లైమాక్స్ కాస్త త్వరగా ముగించిన భావన కలుగుతుంది. 

నటన, సాంకేతికవర్గం : 

మల్లేశం పాత్రలో ప్రియదర్శి నటించాడు అనడం కన్న జీవించాడు అనడం కరెక్ట్. ఇన్నాళ్లు అతను కమెడియన్ గా కనిపించగా మల్లేశం పాత్రలో ప్రియదర్శి అద్భుతమైన నటన కనబరిచాడు. ఇక సినిమాలో మరో ప్రధాన పాత్ర మల్లేశం తల్లి పాత్ర చేసిన ఝాన్సి. ఆమె కూడా తన నటనతో కట్టిపడేసింది. మల్లేశం తండ్రిగా నటించిన ఆనంద్ చక్రపాణి కూడా సహజ నటనతో మెప్పించాడు. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించాయి.

ఇక టెక్నికల్ టీం విషయానికొస్తే.. బాలు శాండిల్య సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. తెలంగాణా పల్లె అందాలను అద్భుతంగా చూపించారు. మార్క్ కె రాబిన్ సంగీతం అలరించింది. నేపథ్య సంగీతం కూడా సినిమాకు ప్లస్ అయ్యింది. 90వ దశకంలో జరిగే కథగా ఆర్ట్ వర్క్ చాలా బాగుంది. పెద్దింటి అశోక్ కుమార్ మాటలు సినిమాకు మరో హైలెట్ అని చెప్పొచ్చు. డైరక్టర్ రాజ్ ఆర్ మల్లేశం కథను చాలా అద్భుతంగా చెప్పాడు. మల్లేశం కథతో పాటుగా తెలంగాణా జీవన వాస్తవికతను చూపించడంలో సక్సెస్ అయ్యాడు. సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఒక్కమాటలో : 

మల్లేశం.. ఇది ఒక సామాన్యుడు అసమాన్య కథ..!  

రేటింగ్ : 3.5/5   


Related Post