టాక్సీవాలా రివ్యూ & రేటింగ్

November 17, 2018
img

విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో వచ్చిన సినిమా టాక్సీవాలా. గీతా ఆర్ట్స్-2, యువి క్రియేషన్స్ కలిసి నిర్మించిన ఈ సినిమాలో విజయ్ సరసన ప్రియాంకా జవల్కర్ హీరోయిన్ గా నటించింది. ఈరోజు రిలీజైన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

రేటింగ్ : 2.75/5

కథ :

శివ (విజయ్ దేవరకొండ) ఐదేళ్లు కష్టపడి డిగ్రీ పూర్తి చేస్తాడు. హైదరాబాద్ వచ్చి ఏదో ఒక జాబ్ చేయాలని అనుకున్న శివ తన దగ్గర ఉన్న డబ్బు మొత్తంతో ఓ పాత కాలం కారు కొంటాడు. అతని లైఫ్ లోకి కారు వచ్చాక శివకి బాగా కలిసి వస్తుంది. అయితే అనుకోకుండా కారు వల్ల అతను ప్రాబ్లమ్స్ లో పడతాడు. కారులో ఓ దయ్యం అతన్ని భయపెడుతుంది. అసలు కారులో దెయ్యం ఎలా వచ్చింది. ఆ కారుకి శివకు సంబంధం ఏంటి. కారులో దెయ్యం ఎవరి మీద పగ బట్టింది అన్నది సినిమా కథ.   

విశ్లేషణ :

హర్రర్ కథలతో వచ్చే సినిమాలకు కామెడీ టచ్ ఇచ్చి ఈమధ్య చాలా సినిమాలు సక్సెస్ అయ్యాయి. అయితే రొటీన్ ఫార్ములాతో వచ్చే కథలు చూసి ఆడియెన్స్ కు బోర్ కొట్టింది. అయితే టాక్సీవాలా మాత్రం హర్రర్ కథలోనే కొత్త అటెంప్ట్ చేశాడు. ఆస్ట్రాల్ ప్రొజెక్షన్ అనే కొత్త కాన్సెప్ట్ తో దర్శకుడు రాహుల్ సంకృత్యన్ ఆడియెన్స్ ను మెప్పించాడు.

సినిమా అంతా సరదాగా సాగించిన దర్శకుడు సెకండ్ హాఫ్ కాస్త స్లో చేశాడు. మొదటి భాగం ఎంటర్టైనింగ్ డోకా లేదు. ఇక స్క్రీన్ ప్లే విషయంలో గ్రిప్పింగ్ మిస్సవని దర్శకుడు ఫైనల్ గా సినిమాతో సత్తా చాటాడు. ఇక ఈ సినిమా తమిళంలో నయనతార నటించిన డోరా సినిమాకు దగ్గరగా ఉంటుంది.

నోటా తర్వాత విజయ్ సినిమాగా వచ్చిన టాక్సీవాలా మళ్లీ అతన్ని హిట్ ట్రాక్ ఎక్కించిందని చెప్పొచ్చు. విజయ్ ఫ్యాన్స్ కు నచ్చే అంశాలు ఉన్నాయి. ఇక సగటు సిని ప్రేక్షకుడు మెప్పించే కథ, కథనంతో టాక్సీవాలా వచ్చింది.

నటన, సాంకేతికవర్గం :

విజయ్ దేవరకొండ నటన ఎప్పటిలానే ఆకట్టుకుంది. శివగా సినిమా మొదలైన కొద్దిసేపటికే అతని పాత్ర నచ్చేస్తుంది. అతని స్టైల్, డైలాగ్ డెలివరీ బాగుంది. ఇక సినిమాలో హీరోయిన్ గా నటించిన ప్రియాంకా జవల్కర్ సినిమాలో అంత ప్రాముఖ్యత లేని పాత్ర అయినా మెప్పించింది. మాళవిక నాయర్ కూడా చిన్న పాత్ర అయినా సినిమాలో ప్రాధాన్యత ఉన్న పాత్ర చేసింది. ఇక విష్ణు అనే కొత్త కమెడియన్ టాక్సీవాలాకు స్పెషల్ ఎట్రాక్షన్. ఇక మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించాయి.

ఇక సినిమా టెక్నికల్ టీం విషయానికొస్తే.. జేక్స్ బిజోయ్ మ్యూజిక్ ఓకే అనిపిస్తుంది. సుజీత్ సారంగ్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాకు అతని కెమెరా వర్క్ చాలా ప్లస్ అయ్యింది. కథ, కథనాల్లో దర్శకుడు రాహుల్ సంకృత్యన్ తన సత్తా చాటాడు. సినిమా కాన్సెప్ట్ కొత్తది కాకున్నా ఎంటర్టైనింగ్ గా సినిమా అందించడంలో సక్సెస్ అయ్యాడు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రిచ్ గా ఉన్నాయి. 

ఒక్కమాటలో :

విజయ్ టాక్సీవాలా.. ఇదో థ్రిల్లింగ్ కామెడీ రైడ్..! Related Post