గూఢచారి రివ్యూ & రేటింగ్

August 03, 2018
img

రేటింగ్ : 3/5 

కథ :

రా ఏజెంట్ అయిన రఘువీర్ (రవి కిశోర్) ఒక సీక్రెట్ ఆపరేషన్ లో ప్రాణాలు కోల్పోతాడు. అతని కొడుకి ప్రాణాపాయం ఉందని తెలిసి రఘువీర్ స్నేహితుడు సత్య (ప్రకాశ్ రాజ్) గోపి అలియాస్ అర్జున్ ను పెంచుతాడు. అతను కూడా రా ఏజెంట్ గా అవ్వాలని చూస్తాడు. ఎన్నిసార్లు ప్రయత్నించినా అది సాధ్యపడదు. కాని ఫైనల్ గా త్రినేత్రలో స్థానం సంపాదిస్తాడు. అయితే అప్పుడే అతనికి అనుకోని విధంగా సమస్య ఎదురవుతుంది. దేశద్రోహిగా అతని మీద ముద్ర పడుతుంది దాని నుండి గోపి ఎలా తనని తానూ ప్రూవ్ చేసుకున్నాడు అన్నది సినిమా కథ. 

విశ్లేషణ :   

ఇండియన్ సినిమాల్లో జేమ్స్ బాండ్ మూవీలు తక్కువే.. స్పై థ్రిల్లర్ లకు కేరాఫ్ అడ్రెస్ హాలీవుడ్ అన్నట్టుగా ఉండే టాక్ మారేలా తెలుగు పరిశ్రమ నుండి వచ్చిన జేమ్స్ బాండ్ మూవీ గూఢచారి. సినిమా అంతా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో నడుస్తుంది. కథ, కథనం రాసిన అడివి శేష్ తన పెన్ పవర్ ఏంటో చూపించాడు.

మొదటి భాగం మొత్తం సీక్రెట్ ఏజెంటుగా మారేందుకు ఎలాంటి శిక్షణ ఇస్తారన్నది చూపించారు. అది కూడా చాలా డీటైల్డ్ గా చూపించారు. సెకండ్ హాఫ్ మాత్రం ట్విస్టులతో సర్ ప్రైజ్ చేశారు. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ అందరిని అలరిస్తుంది. క్షణం తర్వాత అడివి శేష్ మరోసారి అలాంటి డిఫరెంట్ జానర్ నే ఎంచుకోవడం విశేషం. 

సినిమా టీజర్, ట్రైలరే అంచనాలు పెంచగా అసలు సినిమా థియేటర్ లో చూపించాడు. గూఢచారి ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి మంచి థ్రిల్ మూవీ చూశామన్న భావనతో ఇంటికెళ్లొచ్చు. అయితే మాస్ ఆడియెన్స్ కు ఇది నచ్చకపోవచ్చు.

నటన, సాంకేతికవర్గం :

అడివి శేష్ పాత్రే సినిమా మొత్తం నడిపిస్తుంది. రాసుకున్న పాత్రలో అదరగొట్టాడు. శోభిత దూళిపాల బాగానే చేసింది. ప్రకాశ్ రాజ్, వెన్నెల కిశోర్, రవి కిశోర్ లతో పాటుగా విలన్ గా జగపతి బాబు సర్ ప్రైజ్ చేశాడు. 20 ఏళ్ల తర్వాత సుప్రియ తగిన పాత్రలో నటించి మెప్పించింది.

టెక్నికల్ టీం విషయానికొస్తే.. శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ సినిమాకు ప్రాణం పోసింది. నేపథ్యం సంగీతం సినిమా మరో లెవల్ కు తీసుకెళ్లింది. షనీల్ డియో సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సినిమా మూడ్ క్రియేట్ అయ్యేలా కెమెరా వర్క్ ఉంది. దర్శకుడు శషి కిరణ్ డైరక్షన్ స్మార్ట్ గా ఉంది. కథ, కథనాల్లో అడివి శేష్ మరోసారి తన సత్తా చాటాడు. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

ఒక్కమాటలో :

గూఢచారి.. అంచనాలకు మించి అదరగొట్టాడు..!

Related Post