పంతం రివ్యూ & రేటింగ్

July 05, 2018
img

రేటింగ్ : 2/5

కథ :

విక్రాంత్ (గోపిచంద్) ఓ బిలీనియర్ కొడుకు.. ఓ చిన్న పని మీద ఇండియాకు వచ్చిన అతను ఇక్కడ రాజకీయ నాయకులు చేస్తున్న అక్రమాలను చూసి వారి నుండి ప్రజల కష్టాలను కాపాడాలని ఫిక్స్ అవుతాడు. పొలిటికల్ లీడర్స్ అంతా అక్రమంగా సంపాధించిన తమ డబ్బంతా హోం మినిస్టర్ జయేంద్ర అలియాస్ నాయక్ (సంపత్) దగ్గర ఉంచుతారు. వాటిని కనిపెట్టి పక్కా ప్లానింగ్ తో చోరీ చేస్తాడు విక్రాంత్. కోట్ల ఆస్థి పరుడు విక్రాంత్ వారి డబ్బు లూటీ చేయడానికి గల కారణాలు ఏంటి..? రాజకీయ నాయకుల డబ్బుతో విక్రాంత్ ఏం చేశాడు..? వారిపై రివర్స్ లో కేసు వేసిన విక్రాంత్ కు ఎలాంటి ఎదురుదెబ్బలు తగిలాయి అన్నది కథ.

విశ్లేషణ :

పొలిటికల్ లీడర్స్ జనాల డబ్బు కాజేయడం.. వారి కష్టాలను పట్టించుకోకుండా తిరగడం.. పైపై హామీలిచ్చి వారికి ప్రభుత్వం రిలీజ్ చేసే డబ్బుని కూడా వారే నొక్కేయడం ఇలాంటి కథలు చాలా వచ్చాయి. అయితే కొత్తగా ఈ సినిమాలో యాక్సిడెంట్ అయ్యి ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం ఇచ్చే ఎక్స్ గ్రేషియా కూడా ఎలా వారికి చెందకుండా రాజకీయ నాయకులు అడ్డు పడుతున్నారో చూపించారు.

కథగా అనుకున్న పాయింట్ తెర మీద చూపించాడు అయితే హోం మినిస్టర్ లాంటి కేడర్ ఉన్న వ్యక్తి దగ్గర నుండి అంత డబ్బు కొట్టేయడం పక్కా సినిమాటిక్ గా అనిపిస్తుంది. అంతేకాదు కొన్ని చోట్ల లాజిక్ లెస్ గా కూడా సీన్స్ వస్తాయి. సినిమా కథనం వేగంగా నడిపించినట్టు అనిపించినా దానిలో ఏమాత్రం కొత్తదనం చూపించలేదు.  

హీరో, హీరోయిన్ కెమిస్ట్రీ అయితే అంతగా వర్క్ అవుట్ కాలేదు. మిగతా అంశాలు ఎలా ఉన్నా గోపిచంద్ యాక్షన్ పార్ట్ బాగుంది. ఓరకంగా గోపిచంద్ చాలా రోజుల తర్వాత ఇలాంటి యాక్షన్ కథతో వచ్చాడని చెప్పొచ్చు. రొటీన్ గా సాగిన కథ, కథనాలు ఆడియెన్స్ కు అంత కిక్ ఇవ్వవు. 

నటన, సాంకేతికవర్గం : 

గోపిచంద్ ఎప్పటిలానే తన ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. కోర్ట్ సీన్స్ లో డైలాగ్స్ బాగా చెప్పాడనిపిస్తుంది. సినిమా కోసం గోపిచంద్ కష్టం కనబడుతుంది. హీరోయిన్ మెహ్రీన్ ఏమాత్రం గుర్తింపు వచ్చే పాత్ర చేయలేదు. పాటల కోసమే ఆమె పాత్ర అనిపిస్తుంది. సంపత్ విలనిజం అంత పవర్ ఫుల్ గా అనిపించలేదు. అదీగాక విలన్ గా అతను కూడా రొటీన్ గానే అనిపించాడు. తణికెళ్ల భరణి, షియాజి శిండే, జయప్రకాశ్ రెడ్డి రెగ్యులర్ పాత్రలే చేశారు. శ్రీనివాస్ రెడ్డి, పృధ్వి నవ్వించే ప్రయత్నం చేసిన అంతగా మెప్పించలేదు.  

ఇక టెక్నికల్ టీం విషయానికొస్తే.. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ పర్వాలేదు. కొన్ని చోట్ల గోపిచంద్ బాగా హైలెట్ అయ్యేలా తీశాడు. దర్శకుడు కథ రొటీన్ గా అనిపించినా కథనం ఆడియెన్స్ ను మెప్పించడంలో ఫెయిల్ అయ్యాడు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. మ్యూజిక్ అసలు బాగాలేదు. గోపిసుందర్ బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వలేకపోయాడు.     

ఒక్కమాటలో : 

గోపిచంద్ 'పంతం'.. మధ్యలో పక్కదారి పట్టింది..!   

  


Related Post