మహానటి రివ్యూ & రేటింగ్

May 09, 2018
img

రేటింగ్ : 3.5/5

కథ :

కోమాలో ఉన్న సావిత్రి గురించి స్టోరీ సిద్ధం చేసే క్రమంలో జర్నలిస్ట్ అయిన మధురవాణి (సమంత) ఆమె కథను గురించి తెలుసుకుని.. ఆమె బాల్యం.. నట ప్రస్థానం.. ఆమె చివరి దశ ఇలా అన్నిటిని ప్రస్థావిస్తూ మహానటి సినిమా సాగుతుంది. జెమిని గణేషన్ తో రహస్య వివాహం.. ఆమె కెరియర్ పతనం.. మందుకి బానిసగా మారడం.. చివరికి ఆమె ఎలా పరమపదించింది. ఇలా ఆకాశవీధిలో అందాల జాబిలి అంటూ వాణి చూపించే కథే ఈ మహానటి.

విశ్లేషణ :

సావిత్రి బయోపిక్ అనగానే తెలిసిన కథే కదా అని కొందరు కొట్టిపారేశారు. ఇక మరికొందరు కథనాయిక కథ కదా అని లైట్ తీసుకున్నారు. కాని అంచనాలకు తగినట్టుగానే మహానటి సావిత్రి బయోపిక్ ఆవిష్కరించారు దర్శకుడు నాగ్ అశ్విన్. జీవిత కథను ఏమాత్రం కల్పితాలు లేకుండా తెరకెక్కించాడు.

అంతేకాదు ఎలాంటి అనవసరపు హంగులకు తావివ్వకుండా సినిమా చాలా నీట్ గా క్లియర్ గా తెరకెక్కించారు. సినిమా ఎంచుకున్న కథ.. దానికి తగినట్టుగా కథనం.. ఇలా అన్ని అంశాల్లో దర్శకుడు చాలా పకడ్బందీగా సినిమా తీశారు. ముఖ్యంగా మొదటి భాగం బాగుంది. ఇక క్లైమాక్స్ సీన్స్ లో అయితే మనసులని కదిలించేస్తుంది. 

బయోపిక్ అనగానే అదేదో డాక్యుమెంటరీ లా కాకుండా సినిమా ఎంతో ఎక్సైటింగ్ గా ప్రతి ఒక్క సన్నివేశంలోనూ సావిత్రి గొప్పతనం చాటేలా సినిమా ఉంటుంది. సెకండ్ హాఫ్ కాస్త స్లో అయినట్టు అనిపించిన సరే ముగింపు సన్నివేశాలు మాత్రం కట్టిపడేస్తాయి.

నటన, సాంకేతికవర్గం :

మహానటి టైటిల్ రోల్ సావిత్రి పాత్రలో నటించిన హీరోయిన్ కీర్తి సురేష్. ఆమెకు తగినట్టుగా తన అభినయంతో ఆకట్టుకుంది కీర్తి సురేష్. కొన్ని సన్నివేశాల్లో ఆ మహానటికి తగిన నటిగా కీర్తి తన గుర్తింపు తెచ్చుకుందని చెప్పొచ్చు. సినిమాలో ఆమెతో పాటుగా దుల్కర్ జెమిని గణేషన్ గా నటించిన దుల్కర్ సల్మాన్ కూడా బాగా చేశాడు. సమంత పాత్ర ఆకట్టుకుంది. విజయ్ దేవరకొండ కూడా ఇంప్రెస్ చేశాడు. ప్రకాశ్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, మోహన్ బాబు, క్రిష్, అవసరాల శ్రీనివాస్, నాగ చైతన్య ఇలా అందరు బాగా చేశారు.  

టెక్నికల్ టీం విషయానికొస్తే.. మిక్కి జే మేయర్ సంగీతం సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది. టైటిల్ సాంగ్ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ కూడా డిజిటల్, ఫిల్మ్ ఫార్మెట్ లను వేరుగా చూపించారు. దర్శకుడు నాగ్ అశ్విన్ చాలా నిజాయితీగా మహానటి సినిమా చేశాడని చెప్పొచ్చు. సినిమా ఆడియెన్స్ అందరికి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సినిమా సెట్స్ తోట తరణి బాగా వేశారు. ఎడిటింగ్ కూడా చాలా నీట్ గా కట్ చేశారు. అయితే సెకండ్ హాఫ్ కాస్త ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. 

ఒక్కమాటలో :

మహానటి సావిత్రి గొప్ప నివాళి ఈ 'మహానటి' సినిమా..!


Related Post