టాలీవుడ్ నటుడు ఆత్మహత్య!

December 11, 2017


img

బొమ్మరిల్లు, అమ్మాయిలు, అబ్బాయిలు వంటి కొన్ని సినిమాలలో నటించిన నటుడు విజయ్ సాయి ఆత్మహత్య చేసుకొన్నాడు. సినిమాలలో అవకాశాలు లభించకపోవడంతో తీవ్ర నిరాశా నిస్పృహలలో కొట్టుమిట్టాడుతున్న విజయ్ సాయి ఆదివారం రాత్రి యూసఫ్ గూడాలో తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

ప్రేక్షకులకు అందమైన రంగుల ప్రపంచాన్ని ఆవిష్కరించే సినీ పరిశ్రమలో ఇటువంటి విషాదకర సంఘటనలు జరుగుతుండటం బాధాకరమే. సాధారణంగా ఒకసారి సినీ పరిశ్రమలో ప్రవేశించినవారు, దాని ద్వారా లభించే గుర్తింపు, పేరు ప్రతిష్టలు, డబ్బుకు అలవాటుపడిన తరువాత మరే ఇతర రంగాలలో ఇమడలేరు. ఒకసారి ఈ మాయాప్రపంచంలో అడుగుపెట్టిన తరువాత అవకాశాలు లభించకపోయినా, ఏదో ఒకరోజు అదృష్టం తమ తలుపుతట్టకపోతుందా...తమ దశ తిరుగకపోతుందా అనే ఆశతో జీవిస్తుంటారు. ఆ క్లిష్ట సమయంలో కూడా సమాజంలో తమ గుర్తింపును, హోదాను నిలుపుకోవడం కోసం శక్తికి మించి ఖర్చులు చేసి అప్పులపాలైనవారున్నారు... లేదా చెడు వ్యసనాలకులోనై బలైపోయినవారున్నారు. సినీ పరిశ్రమ ఒక పద్మవ్యూహం వంటిదని చెప్పవచ్చు. దానిలోకి ప్రవేశించడమే తప్ప బయటకు రావడం కష్టం. ఉదయ్, విజయ్ సాయి వంటి యువ నటులు దానిలో చిక్కుకొని బలైపోతున్నారు. యువ నటులే కాదు సీనియర్ నటులైన వేణు మాధవ్, అలీ వంటివారు సైతం సినిమా అవకాశాలను దక్కించుకోవడం కోసం కొత్తవారితో పోటీపడవలసివస్తోంది. ఇటువంటి పరిణామాలు కెమెరా వెనుక ఎంత చీకటి ప్రపంచం ఉందో కళ్ళకు కట్టినట్లు చూపుతుంటాయి.  


Related Post

సినిమా స‌మీక్ష