శివ బాలాజీ: బిగ్ బాస్ షో విజేత

September 25, 2017


img

తెలుగులో మొట్టమొదటిసారిగా ప్రసారమయి ఏకధాటిగా 70 రోజుల పాటు సాగిన బిగ్ బాస్ షోలో శివబాలాజీ విజేతగా నిలిచారు. ఆయనకు బిగ్ బాస్ సీజన్-1 ట్రోఫీ దానితో బాటు రూ.50 లక్షలు బహుమతి అందించారు. 

ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బిగ్ బాస్ ఫినాలే కార్యక్రమం జరిగింది. దానిని కూడా ఎన్టీఆర్ తన అద్భుతమైన వాక్చాతుర్యంతో, డ్యాన్సులతో.. అటు ప్రేక్షకులను, ఇటు ఆ షోలో పాల్గొన్న పార్టిసిపెంట్స్ ను కూడా ఆనందింపజేశాడు. నాలుగు గంటల పాటు ఏకధాటిగా సాగిన ఈ ఫినాలే కార్యక్రమంలో ఎక్కడా బోర్ కొట్టించకుండా చాలా అద్భుతంగా నిర్వహించి ఎన్టీఆర్ తన సత్తా మరోమారు చాటుకొన్నాడు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, ఎన్టీఆర్ కలిసి చేసిన డ్యాన్సులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎన్టీఆర్ సూపర్ హిట్ సినిమాలలో పాటలకు వారిరువురూ డ్యాన్స్ చేశారు. 

 ఈ షోలో ఫైనల్స్ వరకు చేరుకొన్న  ఐదుగురిలో మొట్టమొదట అర్చన, తరువాత వరుసగా నవదీప్, హరితేజలను చిత్రవిచిత్రమైన పద్దతులలో ఎలిమినేట్ చేసి చివరికి మిగిలిన ఆదర్శ్, శివ బాలాజీలను స్టేజి మీదకు తీసుకువచ్చి వారిరువురిలో శివ బాలాజీని ఈ షో విజేతగా ఎన్టీఆర్ ప్రకటించారు. 

ఇంతకు ముందు బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయినవారిలో ముమైత్ ఖాన్, కల్పన తప్ప మిగిలినవారందరూ.. ప్రిన్స్‌, ధన్‌రాజ్‌, సంపూర్ణేష్‌ బాబు, సమీర్‌, మహేష్‌ కత్తి, మధుప్రియ, కత్తి కార్తీక, దీక్షా పంత్ హాజరయ్యారు.

ఈ బిగ్ బాస్ షోలో పాల్గొని ఎలిమినేట్ అయిన ప్రిన్స్‌, షీలా, సమీర్‌, కత్తి కార్తిక, ధన్‌రాజ్‌ లకు ప్రత్యేక అవార్డులు ఇచ్చారు. 

ఇక తన అల్లరితో, ఆటపాటలతో ఈ షోను చాలా రక్తి కట్టించిన హరితేజ ఈ షోలో విజేతగా నిలుస్తుందని చాలా మంది భావిస్తే, ఎవరూ ఊహించని విధంగా ఆమె ఆఖరు నిమిషంలో ఎలిమినేట్ అయ్యింది. శివ బాలాజీకి రన్నర్-అప్ గా ఆదర్శ్ నిలవడం విశేషం. 

మొదట చాలా పేలవంగా సాగిన ఈ బిగ్ బాస్ షో ముగిసే సమయానికి చాలా ప్రజాధారణ పొంది, మళ్ళీ బిగ్ బాస్ షో సీజన్-2 ఎప్పుడు మొదలవుతుందా అని ఎన్టీఆర్ తో సహా అందరూ ఎదురుచూసేలా ముగియడం విశేషం. 


Related Post

సినిమా స‌మీక్ష