థాంక్స్ త్రివిక్రమ్..థాంక్స్ తమన్!

January 20, 2020


img

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురంలో...’ సినిమా విడుదలకు ముందే మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకొంది. సంక్రాంతికి విడుదలైన ఆ సినిమా అల్లు అర్జున్ అభిమానుల అంచనాలకు మించి చాలా గొప్పగా ఉండటంతో వారి ఆనందానికి అంతేలేదు. కధ చాలా పాతదే అయినప్పటికీ దర్శకుడు త్రివిక్రమ్, సంగీత దర్శకుడు తమన్, కెమెరామెన్ పిఎస్ వినోద్, ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ అందరూ కలిసి ఒక అద్భుతం సృష్టించారు. దాంతో సినిమాను క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అందరూ సమానంగా సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. అల్లు అర్జున్ కెరీర్‌లో ఇదో మైలురాయిగా నిలిచిపోతుందని అందరూ అనుకొంటున్నారు. 

ఈ సినిమా సక్సస్ మీట్ ఆదివారం విశాఖపట్నంలో జరిగింది. దానిలో అల్లు అర్జున్ మాట్లాడుతూ, “ఒక మంచి కధతో సినిమా తీస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని ఈ సినిమాతో మరోసారి నిరూపించారు. అందుకు ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. ఇంతకు మునుపు నా సినిమాలు చూసినవారు వాటిలో నా ఫైట్స్ బాగున్నాయనో లేదా డ్యాన్స్ బావున్నాయనో మెచ్చుకొనేవారు కానీ ఈ సినిమాలో నా నటన బాగుందని అందరూ మెచ్చుకొంటున్నారు. అందుకు నాకు చాలా సంతోషం కలుగుతోంది. నాన్నగారి గీతా ఆర్ట్ బ్యానర్లో అనేక సూపర్ హిట్స్ వచ్చాయి. వాటిలో ఇప్పుడు నా సినిమా కూడా ఒకటవడం ఇంకా సంతోషం కలిగిస్తోంది. ఇందుకు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీత దర్శకుడు తమన్, ఇంకా ఈ సినిమా కోసం పనిచేసిన వారందరికీ పేరుపెరుణా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను,” అన్నారు.


Related Post

సినిమా స‌మీక్ష