డియర్ కామ్రేడ్ : రివ్యూ

July 26, 2019


img

యువ హీరో విజయ్ దేవరకొండ హీరోగా భరత్ కమ్మ డైరక్షన్ లో వచ్చిన సినిమా డియర్ కామ్రేడ్. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ నిర్మించిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

చైతన్య అలియాస్ బాబి (విజయ్ దేవరకొండ) కమ్యునిస్ట్ భావాలు కలిగిన కాలేజ్ స్టూడెంట్. తాత కామ్రేడ్ సూర్యం (చారు హాసన్) ఆశయాలను ఫాలో అయ్యే వ్యక్తి. స్టూడెంట్ సమస్యల మీద పోరాటం చేసే బాబికి అపర్ణ దేవి అలియాస్ లిల్లీ (రష్మిక మందన్న) పరిచయం అవుతుంది. ఇద్దరు మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారుతుంది. స్టూడెంట్ సమస్యలతో పాటు లోకల్ లీడర్ తమ్ముడుని చేయిచేసుకోవడం వల్ల బాబి మీద ఆ లీడర్ గ్యాంగ్ కన్నేసి ఉంచుతుంది. బాబి ఇలా గొడవలు పడుతూ ఉంటే కష్టమని భావిస్తుంది లిల్లీ. ఒకనొకదశలో లిల్లీకి దూరంగా వెళ్తాడు బాబి. ఆ తర్వాత ఇల్లీ కూడా క్రికెట్ తన కెరియర్ గా అనుకోగా ఆమెకు అక్కడ సమస్యలు ఎదురవుతాయి. 3 ఏళ్ల తర్వాత తన ఆవేశం తగ్గించుకున్న బాబికి కెరియర్ వదిలేసిన లిల్లీ కలుస్తుంది. అలాంటి టైంలో బాబి మళ్లీ తన పాత రోజులు గుర్తుచేసుకుంటాడు.. లిల్లీకి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తాడు.. ఆమె సమస్య సాల్వ్ చేసి తన ప్రేమని ఎలా గెలిపించుకున్నాడు అన్నది సినిమా కథ.   

విశ్లేషణ :

డియర్ కామ్రేడ్ దర్శకుడు భరత్ కమ్మ ఒక్క సినిమాతో చాలా విషయాలను ప్రస్థావించాడు. ముఖ్యంగా కామ్రేడ్ అంటూ కమ్యునిస్టు భావాలున్న వ్యక్తిగా హీరోని చూపించాడు. సామాజిక సమస్య మీద సినిమాలో ప్రస్థావించారు. వీటితో పాటుగా అందమైన ప్రేమ కథను రాసుకున్నాడు. ఈ మూడు విభాగాల్లో దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు.

అయితే సినిమా కథనం దగ్గరకు వచ్చే సరికి చాలా స్లోగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఎంగేజింగ్ గా సాగుతుంది. సెకండ్ హాఫ్ మరి సాగదీసినట్టు అనిపిస్తుంది. సినిమా ఎడిటర్ ఇంకాస్త తన కత్తెరకు పని చెప్పి ఉంటే బాగుండేది. దర్శకుడు భరత్ కమ్మ కథ, క్యారక్టరైజేషన్ ఇవన్ని బాగానే కుదిరాయి. 

చెప్పాలనుకున్న సబ్జెక్ట్ చాలా పెద్దది కాబట్టి హీరో, హీరోయిన్ లను బాగా వాడుకున్నాడు. ఆ ఇద్దరు కూడా సినిమాకు తమ ప్రాణం పెట్టి చేశారు. యూత్, ఫ్యామిలీ ఇలా అందరు చూడదగిన సినిమా డియర్ కామ్రేడ్. సినిమా కథనం ఇంకాస్త స్పీడ్ గా ఉండుంటే సినిమా మరో లెవల్ లో ఉండేది.

నటన, సాంకేతికవర్గం :

చైతన్య అలియాస్ బాబి పాత్రలో విజయ్ దేవరకొండ అదరగొట్టాడు. తనకు ఇచ్చిన పాత్రకు విజయ్ 100 పర్సెంట్ మెప్పించాడు. ఎక్కడ క్యారక్టర్ దాటి బయటకు రాలేదు. అయితే డైరక్టరే హీరో క్యారక్టరైజేషన్ విషయంలో కొంత తికమక పడినట్టు అనిపిస్తుంది. ఇక హీరోయిన్ గా రష్మిక మరోసారి తన నటనతో ఆకట్టుకుంది. ఇప్పటివరకు రష్మిక నటించిన సినిమాల్లో ది బెస్ట్ ఇదని చెప్పొచ్చు. విజయ్ దేవరకొండ స్నేహితులుగా నటించిన వారిలో సుహాస్ మెప్పించాడు. చారు హాసన్, ఆనంద్ తమ పాత్రల పరిధి మేరకు మెప్పించారు.

ఇక టెక్నికల్ టీం విషయానికొస్తే.. జస్టిన్ ప్రభాకర్ మ్యూజిక్ సినిమాకు చాలా హెల్ప్ అయ్యింది. అన్ని సాంగ్స్ మెలోడియస్ గా ఉన్నాయి. బిజిఎం కూడా ఆకట్టుకుంది. సుజిత్ సరంగ్ సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది. కథ, కథనాల్లో దర్శకుడు భరత్ కమ్మ తన సత్తా చాటారు. అయితే కథనం చాలా స్లో అవడం వల్ల కాస్త ఇబ్బంది పెడుతుంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. 

ఒక్కమాటలో :

డియర్ కామ్రేడ్.. కొంచం ఇష్టం కొంచం కష్టం..!

రేటింగ్ : 2.75/5



Related Post

సినిమా స‌మీక్ష