నీదీ నాదీ ఒకే కథ రివ్యూ & రేటింగ్

March 23, 2018


img

రేటింగ్ : 3/5

కథ :

రుద్రరాజు సాగర్ చదువంటే అదో భారం అనే భావనతో ఉండే వ్యక్తి. కాని అతని తండ్రి మాత్రం ఉత్తమ ఉపాధ్యాయుడుగా అవార్డులను సైతం అందుకుంటాడు. పండిత పుత్ర పరమ శుంఠ అన్న విధంగా ఉంటుంది ఈ తండ్రి కొడుకుల తీరు. అయితే తండ్రి మెప్పు పొందేందుకు వ్యక్తిత్వ వికాసం పుస్తకాలను చదివి గొప్పవాడు కావాలని అనుకుంటాడు కాని అది కూడా సాధ్యం కాదు. ఇంతకీ సాగర్ అనుకున్న తండ్రి మనసు గెలిచాడా..? అసలు జీవితం ఎలా బ్రతకాలి అన్నది సాగర్ ఎలా తెలుసుకున్నాడు..? తండ్రి కొడుకుల మధ్య జరిగిన ఈ గొడవ ఎలా సుఖాంతం అయ్యింది అన్నది సినిమా కథ.

విశ్లేషణ :

మొదటి సినిమా దర్శకుడే అయినా వేణు ఊడుగుల సినిమాను చాలా అందంగా ప్రతి విషయాన్ని చాలా క్లియర్ గా తెరకెక్కించాడు. చదువు రాని విద్యార్ధులు ఎలా ఆలోచిస్తారు అన్న విధంగా చాలా అంశాలను ప్రస్థావించడం జరిగింది. ముఖ్యంగా సంతోషం ఎక్కడ ఉంటుంది అని చెప్పే సన్నివేశాలు ప్రేక్షకుల మెప్పు పొందుతుంది. 

సినిమా మొదలైన కొద్ది నిమిషాలకే హీరో పాత్రకు కనెక్ట్ అవుతారు ఆడియెన్స్. ఇక చివరగా తండ్రితో జరిపే సంభాషణలు ఆడియెన్స్ హృదయానికి హత్తుకునేలా ఉంటాయి. మొదటి భాగం అంతా సరదాగా సాగుతుంది. సెకండ్ హాఫ్ కాస్త ల్యాగ్ అయినట్టు అనిపించినా కంటెంట్ మీద ఉన్న గ్రిప్పింగ్ తో కవర్ చేశారు. 

కచ్చితంగా ఈ సినిమా యూత్ ఆడియెన్స్ కు నచ్చేలా తీశారు. బాలీవుడ్ లో వచ్చిన తారే జమీన్ పర్, త్రీ ఇడియట్స్ సినిమా స్పూర్తితో ఈ సినిమా తీశారని అనిపిస్తుంది. విద్యార్ధుల మనస్థత్వాలు.. తల్లిదండ్రుల ఆలోచనలకు అద్దం పట్టేలా ఈ సినిమా ఉంటుంది. 

నటన, సాంకేతిక వర్గం :

శ్రీ విష్ణు మరోసారి తన ప్రతిభ కనబరిచాడు. సాగర్ పాత్రలో తను తప్ప మిగతా ఎవరు చేయలేరు అన్నట్టుగా చేశాడు. హీరోయిన్ గా పట్న టిటస్ బాగానే చేసింది. సినిమాలో ఆమె పాత్రకు ప్రాధాన్యత ఉంది. ఇక ఈ సినిమాలో తండ్రి పాత్ర వేసిన దేవి ప్రసాద్ కూడా హీరోకి సమానమైన పాత్రలో కనిపించాడు. దర్శకుడిగా సినిమాలను తీయడం ఆపేసిన దేవి ప్రసాద్ ఫుల్ లెంథ్ రోల్ చేసిన సినిమా ఇది. సినిమాలో ఆయన పాత్ర కూడా బాగా చేశాడు. పోసానితో పాటుగా స్పెషల్ అప్పియరెన్స్ గా వచ్చిన నారా రోహిత్ సర్ ప్రైజ్ ఇచ్చాడు.

ఇక సినిమా టెక్నికల్ టీం విషయానికొస్తే.. సురేష్ బొబ్బిలి మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయ్యింది. మెలోడీగా సాగే పాటలు ఆకట్టుకున్నాయి. రాజ్ తోట, పర్వీజ్ కె సినిమాటోగ్రఫీ బాగుంది. స్నిమా కంటెంట్ కు వారి కెమెరా వర్క్ కూడా ప్లస్ అయ్యింది. నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్ బాగానే ఉంది. సెకండ్ హాఫ్ కొంచం తగ్గిస్తే బాగుండేది. అయితే సినిమా డ్యూరేషన్ కూడా 121 నిమిషాలే అవడం ప్లస్ అయ్యింది. వేణు ఊడుగుల డైరక్షన్ ఇంప్రెస్ చేసింది. కథ, కథనాలు దర్శకుడి ఆలోచనలు బాగున్నాయి. చాలా సహజంగా సినిమా తీయగలిగాడు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమాకు అవసరమైన బడ్జెట్ తో తీశారు.

ఒక్కమాటలో :

నీదీ నాదీ ఒకే కథ.. ఇది తప్పకుండా చూడాల్సిన సినిమానే.



Related Post

సినిమా స‌మీక్ష