కామెడి యాక్టర్ ట్రాజెడీ స్టోరీ..

December 11, 2017
img

హాస్యనటుడు విజయ్ సాయి ఆత్మహత్యకు కుటుంబ కలహాలు ప్రధాన కారణమని తేలింది. అతను ఆత్మహత్య చేసుకొనే ముందు ఒక సెల్ఫీ వీడియో తీసుకొన్నాడు. దానిలో తన ఆవేదన అంతా రికార్డు చేశాడు. తన మరణానికి కారణం తన మాజీ భార్య వనిత, నవయుగ డైరెక్టర్ శశిధర్, వారి లాయర్లే కారణమని వీడియోలో చెప్పినట్లు సమాచారం. 

వనిత కారణంగానే తమ కుమారుడు చాలా కాలంగా డిప్రెషన్ కు గురయ్యి బాధపడుతున్నాడని, చివరికి ఆమె కారణంగానే ప్రాణాలు కూడా తీసుకొంటాడనుకోలేదని విజయ్ తల్లితండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

తాజా సమాచారం ప్రకారం విజయ్ కు మరొకామెతో అక్రమ సంబంధం ఉన్నట్లు వనితకు తెలియడంతో ఆమె విజయ్ నుంచి విడాకులు తీసుకొని తమ పాపను కూడా వెంటతీసుకుపోయింది. భర్త నుంచి విడిపోయినప్పుడు భరణంగా భారీ మొత్తం కోరిందని, కానీ అంత మొత్తం అతను ఇవ్వలేకపోవడంతొ ఆమె అతని కారును తీసుకువెళ్ళిపోయిందని తెలుస్తోంది. ఆమె తన అనుమతి లేకుండా తన కారును తీసుకుపోయిందని రెండు రోజుల క్రితమే విజయ్ సాయి పోలీస్ స్టేషన్లో పిర్యాదు కూడా చేశాడు. ఇంతలోనే ఈ తీవ్ర నిర్ణయం తీసుకొన్నాడు. తనకు, తన కూతురుకు న్యాయం చేయాలని విజయ్ సాయి సెల్ఫీ వీడియో ద్వారా తన తండ్రిని కోరాడు. 

చెట్టంత కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతొ అతని తల్లితండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. విజయ్ సాయి మరణవార్త తెలుసుకొని అయన కుమార్తె వెక్కి వెక్కి ఏడుస్తుంటే అది చూసి అందరి కళ్ళు చెమ్మగిల్లాయి. 

విజయ్ సాయి ఆత్మహత్య చేసుకోవడం, సెల్ఫీ వీడియోలో తనపై ఆరోపణలు చేయడంపై వనిత స్పందిస్తూ, “నిజాలు నిలకడ మీద తెలుస్తాయి. ప్రస్తుతం ఇంతకంటే ఏమీ చెప్పలేను,” అని అన్నారు. ఏది ఏమైనప్పటికీ ఒక హాస్య నటుడి జీవితంలో ఇంత విషాదం నిండి ఉండటం, అది ఇంత విషాదాంతంగా ముగియడం చాలా బాధాకరం.   

Related Post