అవి గ్రహాంతరవాసులు కావు..గుడ్లగూబలు

November 22, 2017
img

ఇటీవల విశాఖ నగరంలో ఒక షిప్పింగ్ కంపెనీ కార్యాలయంలోని మేడమీద గల ఒక బాత్రూంలో రెండు వింతపక్షులను కనుగొన్నారు. అవి తెల్లగా కాస్త పొడవుగా విచిత్రమైన రూపంలో కనబడటంతో అవి గ్రహాంతరవాసులనే పుకార్లు మొదలయ్యాయి. వాటిలో ఒక తల్లి పక్షి రెండు పిల్ల పక్షులు ఉన్నాయి. సదరు సంస్థ జనరల్ మేనేజర్ జెజె నాయక్ వాటి గురించి విశాఖలోని ఇందిరాగాంధీ జులాజికల్ పార్క్ అధికారులకు తెలియజేయడంతో, జూ అధికారులు వచ్చి ఆ రెండు పిల్ల పక్షులను పట్టుకొని వాటిని జూలోని ఇతర నిశాచరాలను ఉంచే గుహకు తరలించారు. జూ అధికారులు అక్కడకు చేరుకొన్న సమయానికి తల్లి పక్షి ఆహారం తీసుకురావడం కోసం బయటకు వెళ్ళడంతో అది వారికి చిక్కలేదు.

ఆ పక్షులను పరిశీలించిన వన్యప్రాణి పరిశోధకుడు సంతోష్ అవి గ్రహాంతరవాసులు కావని, తెలుగులో జీలుగు జాతి గుడ్లగూబలని చెప్పారు. వాటిని ఇంగ్లీషులో ‘బారన్ ఔల్’ అని పిలుస్తారని చెప్పారు. పుట్టినప్పుడు వాటికి ఒంటిపై వెంట్రుకలు ఉండవని అందుకే అవి కాస్త విచిత్రంగా కనిపిస్తాయని చెప్పారు. నిజానికి చాలా పక్షి జాతులలో పుట్టినప్పుడు పెద్దగా వెంట్రుకలు ఉండవని తెలిపారు. అయితే కాకులు, పిచ్చుకలు వంటి పక్షుల గురించి చాలా మందికి తెలుసు కనుక వాటి పిల్లలను చూసి ఎవరూ ఆశ్చర్యపోరని, కానీ ఇటువంటి గుడ్లగూబలు చాలా అరుదుగా మనుషుల కళ్ళబడతాయి కనుక వాటిని చూసి ఈవిధంగా అపోహ చెందడం సహజమేనని చెప్పారు. ఈ రెండు గుడ్లగూబ పిల్లలు తల్లి నుంచి వేరుచేయబడిన కారణంగా బ్రతికే అవకాశాలు తక్కువని, కనుక ఆ రెండు పిల్లలు పెరిగే వరకు వాటిని మళ్ళీ యధాస్థానంలో వదిలివేస్తే మంచిదని, అప్పుడు వాటి తల్లే వాటిని సంరక్షించుకొంటుందని సూచించారు. 

Related Post