బతుకమ్మ సంబురాలకు ఘనంగా ఏర్పాట్లు

September 20, 2017
img

నేటి నుంచి ప్రారంభం అవుతున్న బతుకమ్మ సంబురాలకు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్ జంట నగరాలతో సహా అన్ని జిల్లా కేంద్రాలలో బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించబోతోంది. హైదరాబాద్ లో ఎల్బీ స్టేడియంలో ఈనెల 26న సుమారు 30,000 మంది మహిళలు బతుకమ్మ ఆడుతారు. హైదరాబాద్ లో అన్ని ప్రధాన పర్యాటక కేంద్రాలను, శాసనసభ, సచివాలయం వంటి ప్రభుత్వ కార్యాలయాలను, చార్మినార్ వంటి చారిత్రిక కట్టడాలను విద్యుదీపాలతో అందంగా అలంకరించాబడుతున్నాయి.

హైదరాబాద్ లోనే కాకుండా యాదాద్రి, వేములవాడ తదితర పుణ్యక్షేత్రాలలో కూడ బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. కనుక ఆ ప్రాంతాలను కూడా అందంగా అలంకరించి, భక్తులకు అవసరమైన ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు. ఈసారి గత ఏడాది కంటే ఇంకా ఘనంగా బతుకమ్మ సంబురాలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది కనుక అందుకు తగ్గట్లుగానే బారీగా ఏర్పాట్లు చేస్తోంది. ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి, తెలంగాణాలో వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్ కు చేరుకొనేందుకు టిఎస్ ఆర్టిసి ప్రత్యేక బస్సులను నడిపిస్తోంది.  

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్ నిన్న సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులతో సమావేశమయ్యి బతుకమ్మ ఉత్సవాలకు చేసిన ఏర్పాట్లను సమీక్షించారు. ఈ ఏడాది దేశంలో 15 రాష్ట్రాల నుంచి మహిళలు బతుకమ్మ ఉత్సవాలలో పాల్గొనడానికి వస్తున్నారు. వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 

ఇప్పటికే రాష్ట్రమంతటా బతుకమ్మ పండుగ కళ సంతరించుకొంది. రేపటి నుంచి రాష్ట్రమంతటా హడావుడి మొదలవుతుంది. 

ఈనెల 28న ట్యాంక్ బండ్ పై సద్దుల బతుకమ్మ ఉత్సవాలతో ఈ వేడుకలు ముగుస్తాయి. సద్దుల బతుకమ్మ నిమజ్జనం కోసం అన్ని జిల్లాలో బతుకమ్మ ఘాట్స్ వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు యుద్దప్రాతిపదికన సిద్దం చేస్తున్నారు.  

Related Post