బతుకమ్మ సంబురాలు షురూ

September 20, 2017
img

తెలంగాణా ప్రజల సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతిబింబించేది బతుకమ్మ పండగ. తొమ్మిది రోజుల పాటు సాగే ఈ బతుకమ్మ సంబురాలు నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొదలవుతున్నాయి. తెలంగాణా రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ఇతర రాష్ట్రాలలో, విదేశాలలో స్థిరపడిన తెలంగాణావాసులు ఘనంగా బతుకమ్మ పండుగ జరుపుకొంటున్నారు. బతుకమ్మ పండుగ అంటే తెలంగాణా ఆడపడచులకు ఎంతో ప్రీతిపాత్రమైనది. ఎందుకంటే ఈ పండుగలోనే వారికి ఎంతో ఇష్టమైన పూలతో బతుకమ్మను రూపొందించుకొని వాటి చుట్టూ ఆనందంగా ఆడిపాడుకొనే అవకాశం లభిస్తుంది. కనుక ఈ పండుగకు వారి ముచ్చట్లు, అలంకరణలు, హడావుడి అన్నీ చూడాలే తప్ప కొద్దిపాటి పదాలలో వర్ణించడం కష్టమే.  

ఈ వేడుకలు ఎంగిలిపూల బతుకమ్మతో మొదలయ్యి వరుసగా అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నన్నాబియ్యం బతుకమ్మ, ఆటల బతుకమ్మ, ఆలింగన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ, సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. 

బతుకమ్మ వేడుకలు మహాలయపక్షం ప్రారంభాన్ని సూచిస్తాయి. ఈ మహాలయపక్షంలో చనిపోయిన పెద్దలకు నైవేద్యం సమర్పించడం ఆనవాయితీ కనుక బతుకమ్మ పండుగ మొదట దానితోనే మొదలవుతుంది. పెద్దలకు నైవేద్యంగా పెట్టిన ప్రసాదాన్ని కుటుంబ సభ్యులు అందరూ భక్తితో తింటారు కనుకనే దీనికి ఎంగిలిపూల బతుకమ్మ అనే పేరు వచ్చినట్లు పెద్దలు చెపుతారు. తొమ్మిది రోజులపాటు సాగే ఈ బతుకమ్మ వేడుకలలో వాటి పేర్లలో సూచిస్తున్నట్లుగానే ఆయా రకాల ఆహార పదార్ధాలను వండి నైవేద్యంగా సమర్పిస్తారు. 

ఇక ఈ పండుగలో మరో విశేషమేమిటంటే తంగేడు, గునుగు, బంతీ, చామంతి వంటి సాంప్రదాయ పూలతో మాత్రమే బతుకమ్మలను అందంగా తీర్చిదిద్దుతారు. అందంగా అలంకరించిన ఆ బతుకమ్మలను మద్యలో ఉంచి తెలంగాణా మహిళలు పాడే పాటలు వారి జీవితాలలో కష్టసుఖాలను, సమస్యలను, ఆశలను, కోర్కెలను, ఆనందాలను, తెలంగాణా సంస్కృతీ సంప్రదాయాలను చాటి చెపుతాయి. అందుకే మిగిలిన అన్ని పండుగల కంటే బతుకమ్మ పండుగ అంటే తెలంగాణా ఆడపడచులకు అంత ఇష్టం. 

Related Post