నేను లిమిటెడ్ కంపెనీలో పనిచేస్తున్నట్లుంది: టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే

January 25, 2021
img

"నేను అధికార పార్టీలో ఉండటం చేత నాకు తెలియకుండానే కొన్ని పరిధులు ఏర్పడ్డాయి. దాంతో కవిగా నా సహజత్వాన్ని కోల్పోయినట్లు అనిపిస్తుంటుంది. నా నోటికి నేనే తాళం వేసుకొన్నట్లు అనిపిస్తుంటుంది. ఒక్కోసారి ఏదో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పనిచేస్తున్న భావన కలుగుతుంటుంది. అయితే కళాకారుడు రాజకీయాలలోకి వచ్చి పడితే ఇవన్నీ తప్పవేమో? కవులు, కళాకారులు, మేధావులు స్వేచ్ఛగా భావవ్యక్తీకరణ చేయడం చాలా అవసరం లేకుంటే క్యాన్సర్ సోకినట్లే భావించాల్సి ఉంటుంది," అని అన్నారు. ఈ మాటలు అన్నది మరెవరో కాదు...మానకొండూర్ టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. సోమవారం మహబూబాబాద్‌లో ప్రముఖకవి జయరాజు తల్లిగారి సంతాప సభకు హాజరైనప్పుడు రసమయి ఈ మాటలన్నారు.    

తెలంగాణ ఉద్యమసమయంలో తన కవితలతో పాటలతో ప్రజలను ఉర్రూతలూగించి ఉద్యమస్పూర్తి రగిలించిన రసమయి, ఎమ్మెల్యేగా అయిన తరువాత సహజంగానే ఆచితూచి మాట్లాడవలసి వస్తోంది. ఒక కవిగా ప్రజల హృదయాలను కదిలించిన రసమయి ఎమ్మెల్యే అయిన తరువాత కొన్ని సమస్యలను పరిష్కరించలేనప్పుడు అదే ప్రజల నుంచి విమర్శలు, తిరస్కారాలు ఎదుర్కొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. కనుక కవి హృదయం గాయపడటం సహజమే. అయితే అది ఆయన ఏరికోరి ఎంచుకొన్నదే కనుక సర్దుకుపోకతప్పదు.


Related Post