భూవివాదంతో మనస్తాపం... బిజెపి నేత ఆత్మహత్య

January 13, 2021
img

హైదరాబాద్‌లో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి, బిజెపి నాయకుడు సంరెడ్డి వెంకట్‌రెడ్డి (65) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నారు. తుర్కయాంజల్‌ మున్సిపాలిటీలోని తొర్రూర్‌ గ్రామస్తుడైన సంరెడ్డి వెంకట్‌రెడ్డి చిరకాలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. కనుక ఆ రంగంలో ఉన్నవారికి ఆయన చిరపరిచితులు. గతంలో టిడిపిలో ఉన్న ఆయన ఇటీవలే బిజెపిలో చేరారు. 

కొన్నేళ్ళ క్రితం ఆయన తొర్రూర్ గ్రామంలోని తా వ్యవసాయక్షేత్రం పక్కనే ఉన్న ఒక ఎకరంన్నర భూమిని కొనుగోలు చేసేందుకు ఓ వ్యక్తికి రూ.1.30 కోట్లు చెల్లించి ఒప్పందం చేసుకున్నారు. కానీ డబ్బు ముట్టిన తరువాత ఆ వ్యక్తి భూమిని రిజిస్ట్రేషన్ చేయకుండా వేధిస్తుండటంతో సంరెడ్డి వెంకట్‌రెడ్డి మంగళవారం తన పొలంలోకి వెళ్ళి అక్కడ ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు ఆయనను ఆసుపత్రికి తరలించినా 60 శాతంపైగా శరీరం కాలిపోవడంతో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం సుమారు 5 గంటలకు చనిపోయారు. సంరెడ్డి వెంకట్‌రెడ్డికి భార్య ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. 

Related Post