సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ పవన్‌కుమార్ హత్యలో కొత్త ట్విస్ట్

November 25, 2020
img

రెండు రోజుల క్రితం జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలం బల్వంతాపూర్ గ్రామశివార్లలో హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరు పవన్‌కుమార్‌ను సమీపబందువులే ఓ గదిలో బందించి ఒంటిపై పెట్రోల్ పోసి సజీవదహనం చేసారు. ఆ కేసుపై లోతుగా దర్యాప్తు జరిపిన సీఐ కిషోర్ ఎవరూ ఊహించని కొత్త విషయం కనుగొన్నారు. ఈ హత్య గురించి ఫిర్యాదు చేసిన హతుడు పవన్‌కుమార్‌ భార్య కృష్ణవేణి కూడా ఈ హత్యలో పాల్గొందని పోలీసుల దర్యాప్తులో తేలింది. 

సీఐ కిషోర్ చెప్పిన వివరాల ప్రకారం... సుమారు ఏడాదిగా పవన్‌కుమార్‌, కృష్ణవేణిల మద్య గొడవలు జరుగుతున్నాయి. తన భార్య నగలను బావమరిది జగన్ దొంగిలించాడని పవన్‌కుమార్‌ ఆరోపిస్తుండటంతో వారి మద్య కూడా గొడవలు జరుగుతుండేవి. ఇటీవల జగన్ గుండెపోటుతో మరణించడంతో హైదరాబాద్‌లో ఉంటున్న పవన్‌కుమార్‌, కృష్ణవేణిలు సోమవారం ద్వాదశదినకర్మ కార్యక్రమంలో పాల్గొనేందుకు బల్వంతాపూర్ వచ్చారు.

పవన్‌కుమార్‌ వైఖరితో విసుగెత్తిపోయిన జగన్ అన్నయ్య విజయ్ స్వామి, అతనే చేతబడి చేయించి జగన్‌ను చంపించేశాడని కృష్ణవేణితో సహా ఇంట్లో అందరికీ నమ్మకం కలిగేలా చెప్పాడు. దాంతో కృష్ణవేణి, ఆమె అక్క స్వరూప,  వారి తల్లి ప్రమీల, జగన్ భార్య సుమలత అందరూ కలిసి ఊరుబయట విజయ్ స్వామి ఉంటున్న ఇంట్లో పవన్‌కుమార్‌ను హత్య చేయాలని పధకం రచించారు. ఆ పధకం ప్రకారం జగన్ ఫోటోను ఇనుప గ్రిల్ ఉన్న ఓ గదిలో పెట్టి, ఒకరొకరుగా లోపలకు వెళ్ళి దణ్ణం పెట్టుకొని వచ్చారు.

పవన్‌కుమార్‌ కూడా గదిలోకి వెళ్లినప్పుడు వెంటనే ఆ గది తలుపులు మూసి తాళంవేసి అతనిని లోపల బందించారు. అతను ఎంత వేడుకొంటున్నా పట్టించుకోకుండా వారందరూ బయట నుంచే అతనిపై పెట్రోల్ పోస్తూ నిప్పంటించారు. గదిలో నుంచి తప్పించుకొని బయటపడే మార్గం లేకపోవడంతో అతను లోపలే సజీవదహనమయ్యాడు. 

ఈ హత్యలో కొండగట్టుకు చెందిన నిరంజన్ రెడ్డి అనే ఓ వ్యక్తి కూడా వారికి సహకరించినట్లు కనుగొన్న పోలీసులు అతనిని కూడా అరెస్ట్ చేశారు. భార్యే స్వయంగా భర్తను గదిలో బందించి ఇంత కిరాతకంగా హత్య చేయడం చాలా విస్మయం కలిగిస్తోంది. తనను నీళ్లు తీసుకురమ్మని దూరంగా పంపించి సుమలత తన భర్తను హత్య చేసిందని, ఆ సమయానికి తాను అక్కడే ఉండి ఉంటే తప్పకుండా తన భర్తను కాపాడుకోగలిగేదానినని కృష్ణవేణి ఏడుస్తూ చెప్పడం చూసి ఎవరూ ఆమె ఇంత ఘాతుకానికి పాల్పడుతుందని ఊహించలేదు. కానీ పోలీసుల దర్యాప్తులో  ఆమె కూడా ఈ హత్యలో పాల్గొందనే సంగతి బయటపడింది.

Related Post