నారాయణపేట జిల్లాలో విషాదఘటన

November 21, 2020
img

నారాయణపేట జిల్లాలోని దామరగిద్ద మండలంలోని నంద్యానాయక్ తండాలో కంట తడిపెట్టించే విషాదఘటన జరిగింది. స్థానికుల తెలిపిన దాని ప్రకారం, తండాలో రాములు నాయక్ అనే వృద్ధుడు శుక్రవారం చనిపోయాడు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. అంత్యక్రియలు పూర్తయిన తరువాత వృద్ధుడి ఐదుగురు మనుమలు స్నానానికని సమీపంలోని చెరువులో దిగారు. అయితే వారికి చెరువులో స్నానాలు అలవాటులేకపోవడంతో నలుగురు చెరువులో మునిగి చనిపోయారు.

వారిలో వృద్ధుడి పెద్ద కుమారుడి కొడుకు విశాల్ (9) మునిగిపోతూ గట్టిగా కేకలు వేయడంతో ఆ చెరువు దగ్గరకే వస్తున్న అతని చిన్నాన్న మోహన్ నాయక్ పరుగున వచ్చి అతనిని కాపాడాడు. కానీ చెరువులో మునిగిపోయిన తన కుమారుడు గణేశ్ (8)ని, అన్నయ్య పిల్లలు అర్జున్ (12), అరుణ్ (8), చెల్లెలు కొడుకు ప్రవీణ్ (8)ను కాపాడలేకపోయాడు.

చనిపోయినవారిలో అర్జున్, అరుణ్ వృద్దుడి రెండో కుమారుడు లక్ష్మీనాయక్  పిల్లలుకాగా, గణేశ్ మూడో కుమారుడు మోహన్ నాయక్ కొడుకు, ప్రవీణ్ వృద్ధుడి కుమార్తె అరుణమ్మ కొడుకు. తాత అంత్యక్రియలకు వచ్చి నలుగురు మనుమలు ఒకేసారి చెరువులో మునిగి దుర్మరణం పాలవడంతో ఆ ఇంట్లో అందరూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Related Post