ప్రముఖ కవి దేవీప్రియ మృతి

November 21, 2020
img

ప్రముఖ కవి దేవీప్రియ శనివారం ఉదయం ఆల్వాల్‌లోని తన నివాసంలో తుదిశ్వాసవిడిచారు. డయాబెటీస్ వ్యాధితో తీవ్ర ఆరోగ్యసమస్యలు ఎదుర్కొంటున్న ఆయన ఈనెల 6వ తేదీన నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తుండటంతో కొన్ని రోజుల క్రితం కుటుంబ సభ్యులు ఆయనను ఇంటికి తీసుకువెళ్ళి అక్కడే వైద్యసేవలు అందిస్తున్నారు. ఈరోజు ఉదయం ఆయన ఆరోగ్యపరిస్థితి మరింత క్షీణించి తుదిశ్వాస విడిచారు. 

దేవీప్రియ స్వస్థలం గుంటూరు జిల్లాలోని తాడికొండ. ఆయన అసలు పేరు షేక్ ఖాజా హుస్సేన్. దేవీప్రియ ఆయన కలంపేరు. సాహితీలోకంలో ఆ పేరుతోనే ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకొన్నారు. ఆయన సుమారు 5 దశాబ్ధాలకు పైగా సాహితీ రంగంలో ఉంటూ అనేక అద్భుతమైన కవిత సంపుటిలు రచించారు. ఆయన రచించిన గాలిరంగు కవితా సంకలనానికి 2017లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ‘రన్నింగ్ కామెంట్రీ’ పేరిట ఉదయం, ఆంద్రజ్యోతి పత్రికలలో ప్రచురింపబడిన కామెడీ కవితలు ఆయనకు ప్రత్యేక గుర్తింపును తెచ్చాయి. దేవీప్రియ రేడియో నాటికలు, రంగస్థల నాటికలు, సినిమా పాటలు కూడా రచించారు. సమకాలీన రాజకీయాలు, సమాజంలోని పరిస్థితులపై ఆయన చాలా నిశితంగా, సామాన్యులకు సైతం సులువుగా అర్దమయ్యే విధంగా చాలా సరళంగా రచించిన కవితలు తెలుగు ప్రజలకు ఆత్మీయుడిగా మార్చాయని చెప్పవచ్చు. సామాన్యుల అసామాన్య కవిగా పేర్కొంది దేవీప్రియ మరణం తెలుగు సాహితీలోకానికి, తెలుగు ప్రజలకు తీరనిలోటుగా మిగిలిపోతుంది. ఆయన మృతిపట్ల తెలుగుసాహితీలోకానికి చెందిన పలువురు కవులు, రచయితలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 

Related Post