దేవుడా...ఈ పిల్లల్ని సంపుడేందో!

October 22, 2020
img

తెలంగాణతో సహా దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలలో మైనర్ బాలికలు, మహిళలపై అత్యాచారాలు,  పిల్లల కిడ్నాపులు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల అవి మరికాస్త ఎక్కువైపోయాయి. నాలుగురోజుల క్రితం…ఆదివారం మహబూబాబాద్‌లో కిడ్నాప్ అయిన 9 ఏళ్ళ దీక్షిత్‌ను హత్య చేయబడ్డాడు. 

ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎస్పీ కోటిరెడ్డి ఈరోజు ఉదయం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ కిడ్నాప్, హత్యకు సంబందించిన కొన్ని వివరాలను తెలియజేశారు. 

కిడ్నాపర్ పేరు మంద సాగర్. అతను స్థానిక మూడుకొట్ల చౌరస్తాలో బైక్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. సులువుగా డబ్బు సంపాదించి జల్సాగా బ్రతకాలనే ఉద్దేశ్యంతో బాలుడిని కిడ్నాప్ చేశాడు. బాలుడి కుటుంబంతో అతనికి బాగా పరిచయముండటంతో, ఆదివారం సాయంత్రం సుమారు 6 గంటలకు మంద సాగర్ బైక్‌ వచ్చి ఇంటి ముందు ఆడుకొంటున్న దీక్షిత్‌ను తనతో రమ్మని పిలిచాడు. అతను తెలిసిన వ్యక్తే కావడంతో దీక్షిత్ అతను పిలవగానే వెళ్ళాడు. మంద సాగర్‌కు ఊళ్ళో సిసి కెమెరాలు ఎక్కడెక్కడ ఉంటాయో తెలుసు కనుక వాటి కంటపడకుండా తిప్పితిప్పి దీక్షిత్‌ను కేసముద్రం మండలం అన్నారం దానమయ్య గుట్టపైకి తీసుకువెళ్ళాడు. అప్పటికే భయపడుతున్న దీక్షిత్ ఇంటికి తిరిగి వెళ్ళిపోదామని గొడవ చేశాడు. దాంతో భయపడిన మంద సాగర్ తాను కిడ్నాప్ చేసిన వ్యవహారం తెలిసిపోతుందని భావించి దీక్షిత్‌ గొంతు పిసికి హత్య చేశాడు. ఆ తరువాత అతని ఆచూకీ తెలియకుండా ఉండటం కోసం మృతదేహంపై పెట్రోల్ పోసి తగులబెట్టాడు. దీక్షిత్‌ను హత్య చేసిన బాలుడి తల్లితండ్రులు వసంత, రంజిత్‌లకు 14 సార్లు ఇంటర్నెట్ కాల్స్ చేసి రూ.45 లక్షలు ఇస్తే పిల్లాడిని విడిచిపెడతామని లేకుంటే చంపేస్తానని బెదిరించాడు. దాంతో వారు కంగారుపడి కొంత డబ్బును సమకూర్చుకొని అతను చెప్పిన చోటుకు వెళ్ళి అందించే ప్రయత్నం చేశారు. కానీ వారు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అనుమానం రావడంతో మంద సాగర్‌ ఆ డబ్బు తీసుకొనేందుకు రాలేదు. 

బాలుడి తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు మహబూబాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని 100 మందితో 10 బృందాలు ఏర్పాటు చేసుకొని కిడ్నాపర్ల కోసం గాలించి చివరికి 32 మంది అనుమానితులను ప్రశ్నించి నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా అన్నారం దానమయ్య గుట్టవద్దకు వెళ్ళి చూడగా కాలిబూడిదైన దీక్షిత్ మృతదేహం కనిపించింది. క్లూస్ టీం ఘటనాస్థలానికి చేరుకొని ఆధారాలు సేకరిస్తోంది. 

నలుగురు అనుమానితులలో ఒకరు బాలుడి బాబాయ్ మనోజ్ రెడ్డి కావడం విశేషం. అయితే మంద సాగర్ ఒక్కడే డబ్బుకు ఆశపడి బాలుడిని కిడ్నాప్ చేసి హత్య చేశాడని ఎస్పీ కోటిరెడ్డి చెప్పారు. కిడ్నాపర్ వాడిన టెక్నాలజీనే తాము కూడా వాడుకొనిఅతని ఆచూకీ కనుగొన్నామని చెప్పారు. హైదరాబాద్‌ సైబర్ క్రైమ్ పోలీసుల సహకారంతో అతని ఆచూకీని కనుగొన్నామని చెప్పారు. కిడ్నాపర్‌ను పోలీసులు ఎంకౌంటర్ చేశారని మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబందించి మరిన్ని వివరాలు ఇవాళ్ళ సాయంత్రం లేదా రేపు ఉదయం తెలియజేస్తానని చెప్పారు.   

కొడుకు చనిపోయాడని తెలిసి దీక్షిత్ తల్లితండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పాత కక్షల కోసం అభం శుభం తెలియని చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి హత్యలు చేయడం చాలా బాధాకరం. ఇటువంటి హేయమైన నేరాలకు పాల్పడినవారికి కూడా వీలైనంత త్వరగా కటినమైన శిక్షలు విధించినప్పుడే నేరస్తులలో భయం కలిగి నేరాలు తగ్గే అవకాశం ఉంటుంది.

Related Post