మాజీ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి మృతి

October 22, 2020
img

కార్మిక నాయకుడు, తెలంగాణ తొలి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి (86) బుదవారం అర్ధరాత్రి 12.25 గంటలకు జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో కనుమూశారు. కరోనా బారిన పడ్డ ఆయనకు దాని నుంచి కోలుకొన్నాక న్యుమోనియా సోకింది. ఆ కారణంగా ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకి గత 10 రోజులుగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.



నాయిని 1934లో నల్గొండ జిల్లా దేవరకొండ మండలంలోని నేరేడుగొమ్ము గ్రామంలో జన్మించారు. విద్యార్ధి దశ నుంచే నాయకత్వ లక్షణాలు కనబరిచిన నాయిని 1958లో సోషలిస్ట్ పార్టీలో చేరారు. 1969లో తెలంగాణ తొలి దశ ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నారు. అప్పటి నుంచి కార్మిక సమస్యలపై పోరాడుతూ గొప్ప కార్మికనాయకుడిగా పేరు సంపాదించుకొన్నారు. ఎమర్జన్సీ సమయంలో 18 నెలలు జైలు జీవితం కూడా గడిపారు. 1978, 1985,2004లో మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 

నాయిని నర్సింహా రెడ్డి ఉమ్మడి ఏపీ రాష్ట్ర ప్రభుత్వంలో సాంకేతిక విద్యాశాఖామంత్రిగా పనిచేశారు. కేసీఆర్‌ 2001లో టిఆర్ఎస్‌ పార్టీని స్థాపించి మలిదశ తెలంగాణ ఉద్యమాలు ప్రారంభించగానే నాయిని టిఆర్ఎస్‌లో చేరి తెలంగాణ సాధన కోసం పోరాడారు. తెలంగాణ ఏర్పడిన తరువాత తొలి హోంమంత్రిగా పదవి చేపట్టారు. దాంతోపాటు ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన కార్మికశాఖ బాధ్యతలను కూడా చేపట్టారు.

నాయిని నర్సింహారెడ్డికి భార్య అహల్యా రెడ్డి, కొడుకు దేవేందర్ రెడ్డి, కుమార్తె మమతా రెడ్డి ఉన్నారు. అల్లుడు శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ రాంనగర్ డివిజన్ కార్పొరేటర్‌గా ప్రజలకు సేవలందిస్తున్నారు. నాయిని ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొన్న సిఎం కేసీఆర్‌ నిన్న సాయంత్రమే ఆసుపత్రికి వెళ్ళి ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి వచ్చారు. అధికారిక లాంఛనాలతో గురువారం నాయిని అంత్యక్రియలు హైదరాబాద్‌లో జరుగనున్నాయి. 

Related Post