వరదలతో వారికి భలే గిరాకీ

October 21, 2020
img

హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలో పలు జిల్లాలలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఇళ్ళలోకి వరదనీరు చేరడంతో నిత్యావసరసరుకులు, టీవీ, మిక్సీ, ఫ్రిడ్జ్, పంప్‌సెట్లు వంటి గృహోపకరణాలు, ద్విచక్ర వాహనాలు, కార్లు నీట మునిగాయి. బియ్యం, పప్పులు పాడైపోతే మళ్ళీ కొనుక్కోవచ్చు కానీ గృహోపకరణాలు, వాహనాలు పాడైతే కొత్తవి కొనుక్కోవడం కష్టం కనుక నీట మునిగి పాడైనవాటిని మెకానిక్కుల దగ్గరకు తీసుకువెళుతున్నారు ప్రజలు. దాంతో గృహోపకరణలు, వాహనాలను రిపేర్ చేసే మెకానిక్కులకు మంచి గిరాకీ ఏర్పడింది. లాక్‌డౌన్‌ కారణంగా ఆరేడు నెలలుగా పని, ఆదాయం లేక రోడ్డున పడ్డ మెకానిక్కులకు వరద పుణ్యామని ఇప్పుడు చేతినిండా పని ఆదాయం లభిస్తుండటంతో చాలా సంతోషంగా పనిచేసుకొంటున్నారు. ప్రతీరోజూ డజన్ల కొద్దీ గృహోపకరణలు, వాహనాలు వస్తుండటంతో కొన్ని చోట్ల ఇక కొత్తగా వచ్చేవాటిని వెంటనే రిపేర్లు చేసి ఇవ్వలేమని చెప్పే పరిస్థితి నెలకొంది ఇప్పుడు. అలాగేచాలా చోట్ల సెల్లార్లలోకి నీళ్ళు చేరుతుండటంతో అపార్ట్మెంట్ వాసులు హడావుడిగా పంప్ సెట్లు, వాటికి సంబందించిన పరికరాలు కొనుగోలు చేసేందుకు దుకాణాలవద్ద బారులు తీరుతున్నారు. హటాత్తుగా డిమాండ్ ఏర్పడంతో దుకాణాదారులు వాటి ధరలు పెంచేసి తమ వద్ద ఉన్న సరుకు మొత్తం అమ్మేసుకొంటున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా తీవ్రంగా నష్టపోయి, లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తరువాత కూడా కరోనా భయాలతో జనాలు రాక నష్టపోతున్న తమను ఈ వరదలు ఆదుకొన్నాయని వారూ సంతోషిస్తున్నారు. 

Related Post