శ్రీశైలం ఘాట్‌రోడ్‌లో ప్రమాదం

September 23, 2020
img


శ్రీశైలం ఘాట్‌రోడ్‌లో మంగళవారం రాత్రి ఓ వాహనం అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలోకి జారిపడింది. ఆ వాహనలో ప్రయాణిస్తున్న 9 మందికి గాయాలు కాగా వారిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. హైదరాబాద్‌ ధూల్‌పేటకు చెందిన ఓ కుటుంబం క్వాలిస్ వాహనంలో నిన్న సాయంత్రం శ్రీశైలంకు బయలుదేరారు. వారి వాహనం నాగర్ కర్నూల్ జిల్లాలోని ఈగలపెంట గ్రామానికి సమీపంలోగల మైసమ్మగుడి మలుపు వద్ద చేరుకొన్నప్పుడు అదుపుతప్పి పక్కనే ఉన్న 50 అడుగుల లోయలోకి జారిపడింది. 

ప్రమాదం సంగతి తెలుసుకొన్న స్థానికులు వెంటనే అక్కడకు చేరుకొని క్షతగాత్రులను వ్యానులో నుంచి బయటకు తీసి పోలీసులకు, శ్రీశైలం దేవస్థానం ఈఓ రామారావుకు సమాచారం ఇచ్చారు. దేవస్థానం ఈఓ రెండు అంబులెన్సులను, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఓ అంబులెన్స్ ను ఘటనాస్థలానికి పంపించారు. కర్నూల్ జిల్లాలో సున్నపెంటలోని అగ్నిమాపకశాఖ సిబ్బంది కూడా అక్కడకు చేరుకొని సహాయకార్యక్రమంలో పాల్గొన్నారు. క్షతగాత్రులను మొదట ఈగలపెంటలోని జెన్‌కో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించిన తరువాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు.  

గాయపడినవారిలో నమ్రతా సింగ్, అనిల్ సింగ్, అస్మిత్ సింగ్, నీతూ సింగ్, ధర్మేష్, హేమలత, ధార్మిక్, రాజకుమారిగా పోలీసులు గుర్తించారు. వారిలో రాజకుమారి (55), నీతూసింగ్‌ (40), ధార్మిక్ (8) పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాధమిక విచారణలో తేలింది. పోలీసులు డ్రైవరును అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. 

Related Post