మినీ ట్యాంక్ బండ్‌లో నవీన్ మృతదేహం

September 21, 2020
img

సాధారణంగా నదీపరివాహక ప్రాంతాలలో వరదలు వస్తుంటాయి కానీ రాజధాని హైదరాబాద్‌లో కూడా వరదలు వస్తాయని ఇప్పుడు చెప్పుకోవలసివస్తోంది. ఇటీవల కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్‌ నగరంలో పలు ప్రాంతాలలో రోడ్లు, చెరువులు, కాలువలు అన్నీ కలిసిపోవడంతో వాటిని వేరు చేసి చూడలేని దుస్థితి నెలకొంది. 

ఓపెన్ నాలాలు పొంగిపొరలుతుండటంతో గత గురువారం సాయంత్రం సుమేధా కపూరియా అనే 12 ఏళ్ళ బాలిక నేరేడ్‌మెట్‌లో ఓపెన్ డ్రైనేజ్‌లో పడి కొట్టుకుపోయి బండచెరువులో శవమై తేలింది. ఈ ఘటన జరిగిన మూడు రోజులకే మళ్ళీ సరూర్‌నగర్ రోడ్లపై వరదనీరు ఉదృతంగా ప్రవహించడంతో, అల్మాస్‌గూడకు చెందిన నవీన్ కుమార్ అనే వ్యక్తి నాలా నుంచి పొంగి పోరులుతున్న నీళ్ళలో కొట్టుకుపోయి సమీపంలోని మినీ ట్యాంక్ బండ్‌లో శవమై తేలాడు. ఆదివారం సాయంత్రం అతను ఆ రోడ్డు మీదుగా వెలుతున్నప్పుడు దురదృష్టం కొద్దీ అతని ద్విచక్రవాహనం మొరాయించింది. దాంతో అతను కిందకు దిగినప్పుడు హటాత్తుగా నాలా పొంగి పొర్లడంతో స్థానికులు చూస్తుండగానే నవీన్ కుమార్ దాన్లో కొట్టుకుపోయాడు. 

ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సుమారు 20 గంటలు శ్రమించి సోమవారం సాయంత్రం మినీ ట్యాంక్ బండ్‌లో తేలుతున్న అతని శవాన్ని కనుగొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న నవీన్ కుమార్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నవీన్ కుమార్ చనిపోవడంతో ఇప్పుడు వారి భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారింది. 

ఏటా వర్షాలు కురిసిన ప్రతీసారి అక్కడ పరిస్థితి ఇదేవిధంగా ఉంటుందని స్థానికులు చెప్పారు. ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కనుక సరూర్‌నగర్ మినీ ట్యాంక్ బండ్‌ చుట్టూ ఫెన్సింగ్ వేయాలని తాము చాలాసార్లు మునిసిపల్, జీహెచ్‌ఎంసీ అధికారులకు కోరామని కానీ ఎవరూ పట్టించుకోలేదని చెప్పారు. అధికారుల నిర్లక్ష్యం లేదా అలసత్వం కారణంగానే  ఓ నిండు ప్రాణం బలైపోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. నవీన్ కుమార్ మృతికి జీహెచ్‌ఎంసీ అధికారులే బాధ్యత వహించాలని ప్రభుత్వం అతని కుటుంబాన్ని ఆదుకోవాలని వారు కోరారు. మళ్ళీ ఇటువంటి విషాదఘటనపు పునరావృతం కాకుండా నిరోధించేందుకు తక్షణమే ట్యాంక్ బండ్‌ చుట్టూ ఫెన్సింగ్ వేయించి, నాలాలలో పూడిక తీయించి కాంక్రీట్ మూతలు బిగించాలని కోరారు. 

Related Post