తిరుమల బ్రహ్మోత్సవాలు...కొందరికి మాత్రమే

September 19, 2020
img

తిరుమల బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ జరుగనుంది. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ధ్వజారోహణతో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను ప్రారంభం అవుతాయి. అయితే కరోనా నేపధ్యంలో ఈసారి చాలా పరిమిత సంఖ్యలోనే భక్తులను శ్రీవారి బ్రహ్మోత్సవాలలో పాల్గొనేందుకు అనుమతించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. ఆన్‌లైన్‌లో రూ.300 టికెట్లు కొనుగోలు చేసినవారిని, టీటీడీ బోర్డు సభ్యుల సిఫార్సు లేఖలున్నవారిని, శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ ఉన్నవారిని మాత్రమే కొండపైకి అనుమతిస్తామని టీటీడీ తెలిపింది. అలిపిరి మెట్లమార్గం ద్వారా శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులను ఉదయం 6 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే అనుమతిస్తామని తెలిపింది. కరోనా నేపధ్యంలో ఈసారి బ్రహ్మోత్సవాలలో శ్రీవారికి ఏకాంతసేవలు నిర్వహించి ఆలయంలోనే చక్రస్నానం కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు టీటీడీ తెలిపింది. 

శ్రీవారి బ్రహ్మోత్సవాల వివరాలు: 

సెప్టెంబర్ 19: బ్రహ్మోత్సవాలకు అంకురారార్పణ చేసి విష్వక్సేన ఆరాధన చేస్తారు. 

సెప్టెంబర్ 20: సాయంత్రం 5 గంటలకు ధ్వజారోహణతో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి. ఆరోజు రాత్రి 9 గంటలకు స్వామివారికి పెద్దశేష వాహనసేవ నిర్వహిస్తారు. 

సెప్టెంబర్ 21: ఉదయం 9 గంటలకు చిన్న శేషవాహన సేవ; రాత్రి 9 గంటలకు హంస వాహనసేవ. 

సెప్టెంబర్ 22: ఉదయం 9 గంటలకు సింహవాహన సేవ; రాత్రి 9 గంటలకు ముత్యాల పల్లకీ వాహన సేవ 

సెప్టెంబర్ 23: ఉదయం 9 గంటలకు కల్పవృక్ష వాహన సేవ; రాత్రి 9 గంటలకు సర్వభూపాల వాహన సేవ 

సెప్టెంబర్ 24: ఉదయం 9 గంటలకు స్వామివారు మోహినీ అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. సాయంత్రం 5 గంటలకు స్వర్ణ రధోత్సవం. 

సెప్టెంబర్ 25: ఉదయం 9 గంటలకు హనుమంత వాహన సేవ; రాత్రి 9 గంటలకు గజ వాహన సేవ. 

సెప్టెంబర్ 26: ఉదయం 9 గంటలకు సూర్యప్రభ వాహన సేవ; రాత్రి 9 గంటలకు చంద్రప్రభ వాహన సేవ.

సెప్టెంబర్ 27: ఉదయం 6 గంటలకు రధోత్సవం; రాత్రి 9 గంటలకు అశ్వవాహన సేవ. 

సెప్టెంబర్ 28: ఉదయం 6 గంటలకు చక్రస్నానం; రాత్రి 9 గంటలకు ధ్వజావరోహణంతో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

Related Post