పాపం సుమేధ... నాలాకు బలి

September 18, 2020
img

హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నామని గొప్పలు చెప్పుకొనే పాలకులు, జీహెచ్‌ఎంసీ 12 ఏళ్ళ సుమేధా కపూరియా మృతికి తప్పక సమాధానం చెప్పాల్సి ఉంటుంది. నేరేడ్‌మెట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సంతోషినగర్‌ కాలనీకి  చెందిన సుమేధా కపూరియా గురువారం సాయంత్రం తమ వీధిలో సైకిలు తొక్కుకొనేందుకు వెళ్ళి అదృశ్యమైపోయింది. చీకటి పడినా ఆమె ఇంటికి తిరిగిరాకపోవడంతో తల్లితండ్రులు చుట్టుపక్కల తెలిసినవారి ఇళ్ళలో వాకబు  చేశారు. ఆ తరువాత కాలనీలో వారందరూ కలిసి చుట్టుపక్కల ప్రాంతాలలో సుమేధా కోసం గాలించారు.

ఆమె ఆచూకీ తెలియకపోవడంతో తల్లితండ్రులు నేరేడ్‌మెట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలో దిగిన పోలీసులు కూడా చుట్టుపక్కల గాలించి అక్కడే ఉన్న ఓ నాలాలో బాలిక పడిపోయి ఉండవచ్చనే అనుమానంతో జీహెచ్‌ఎంసీ డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బందిని రప్పించారు. వారు నాలాను పరిశీలిస్తూ ముందుకు సాగగా నాలా చివర ఉండే బండచెరువులో బాలిక శవం తేలుతూ కనిపించింది. అంతవరకు ఇంట్లో ఆడుకొన్న కూతురు చెరువులో శవమై తేలడం చూసి తల్లితండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆమె శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆ నాలాలో గతంలో కూడా ఇద్దరు వ్యక్తులు పడ్డారని, వారిలో ఒకరు చనిపోగా ఒకరిని కాపాడామని స్థానికులు చెప్పారు. నాలాపై కాంక్రీట్ మూత వేయాలని ఎన్నిసార్లు చెప్పినా జీహెచ్‌ఎంసీ అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు.

Related Post