బెంగళూరులో అల్లర్లు...ఇద్దరు మృతి

August 12, 2020
img

బెంగళూరులో మంగళవారం రాత్రి హటాత్తుగా అల్లర్లు మొదలయ్యి విధ్వంసానికి దారి తీసాయి. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాస మూర్తికి సమీప బందువైన నవీన్ అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో పెట్టిన ఓ అభ్యంతరకర పోస్టు ఈ అల్లర్లకు ప్రధాన కారణం. అది ముస్లింల మనోభావాలు దెబ్బతినేవిధంగా ఉండటంతో ఆ వర్గానికి చెందినవారు నగరంలోని కావల్‌ బైరసంద్రలోని ఎమ్మెల్యే శ్రీనివాస మూర్తి ఇంటిపై దాడి చేశారు. ఆయన ప్రోద్బలంతోనే నవీన్ ఫేస్‌బుక్‌లో ఆ పోస్ట్ పెట్టాడని భావించిన అల్లరి మూకలు ఆయన ఇంటిపై రాళ్ళతో దాడులు చేసి, ఆ ప్రాంతంలో ఉన్న వాహనాలకు నిప్పు పెట్టారు. ఆ మంటలు ఎమ్మెల్యే ఇంటికి కూడా వ్యాపించాయి. ఆ సమాచారం అందుకొన్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు అక్కడకు చేరుకోగా వారిని లోపలకు వెళ్ళనీయకుండా ఆందోళనకారులు అడ్డుకొన్నారు. ఆ తరువాత పోలీసులు రాగా వారిపై కూడా దాడి చేయడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఆ ఘర్షణలలో ఇద్దరు వ్యక్తులు చనిపోగా పోలీసులతో సహా పలువురు గాయపడ్డారు. పరిస్థితులు అదుపు తప్పడంతో బెంగళూరు నగరమంతటా సెక్షన్ 144 విధించినట్లు నగర పోలీస్ కమీషనర్ ప్రకటించారు. ఆ ప్రాంతంలో మళ్ళీ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా డీజే హళ్ళి, కేజీ హళ్ళి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కర్ఫ్యూ విధించామని చెప్పారు.    

అల్లర్లకు పాల్పడినవారిలో 110 మందిని పోలీసులు అరెస్ట్ చేసి వారిపై కేసులు నమోదు చేశారు. వారితోపాటు ఫేస్‌బుక్‌లో అభ్యంతరకరమైన పోస్ట్ పెట్టిన నవీన్‌ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దాడి నుంచి ఎమ్మెల్యే శ్రీనివాస మూర్తి, కుటుంబ సభ్యులు క్షేమంగా బయటపడ్డారని జాయింట్ పోలీస్ కమీషనర్ సందీప్ పాటిల్ తెలిపారు. ప్రస్తుతం నగరంలో పరిస్థితులు పూర్తిగా అదుపులోనే ఉన్నాయని చెప్పారు. 

Related Post