అయోధ్య శ్రీరామ మందిరం ప్రత్యేకతలు ఎన్నెన్నో...

August 10, 2020
img

అయోధ్య రామాలయం నిర్మాణపనులకు ప్రధాని నరేంద్రమోడీ ఈనెల 5వ తేదీన శంఖుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఆలయ నిర్మాణ పనులుమొదలు పెట్టి మూడేళ్ళలోగా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకొంది ట్రస్ట్. ఆలయం కోసం అప్పుడే ఓ భారీ గంట కూడా తయారైపోయింది. సుమారు 2,100 కేజీలు బరువున్న ఈ భారీ గంటను యూపీలోని జలేసర్‌లో దావు దయాళ్ అనే నిపుణుడి నేతృత్వంలో 25 మందితో కూడిన ఓ బృందం తయారుచేస్తోంది. దీనిలో బంగారం, వెండి, రాగి, ఇనుము, సీసం, పాదరసం, టిన్, జింక్‌ మిశ్రమాలను వినియోగిస్తున్నారు. ఈ గంటను  మ్రోగిస్తే సుమారు 15 కిమీ దూరం వరకు దాని శబ్ధం వినిపిస్తుందని దావు దయాళ్ చెప్పారు. సుమారు 25 లక్షల వ్యయంతో తయారుచేస్తున్న ఈ గంటను పూర్తిగా సిద్దం చేయడానికి నాలుగు నెలలు కష్టపడ్డామని చెప్పారు. ఇప్పటివరకు మనదేశంలో ఉన్న అన్ని ఆలయాలలోకెల్లా ఇదే పెద్ద గంట. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో 1,000 కేజీలు బరువున్న గంటను ఇంతకు ముందు తయారుచేసి ఇచ్చామని దావు దయాళ్ చెప్పారు. 


అయోధ్య రామాలయం డిజైన్ 1989లోనే సిద్దం అయ్యింది. దేశంలో అనేక సుప్రసిద్ద ఆలయాలకు వంశపారంపర్యంగా డిజైన్లు గీస్తున్న చంద్రకాంత్ సోమ్‌పుర(78), ఆయన ఇద్దరు కుమారులు కలిసి ప్రస్తుత డిజైన్ గీశారు. సుమారు రూ.300 కోట్లు వ్యయంతో నిర్మించబోతున్న ఈ ఆలయాన్ని చాలా విశిష్టమైన రీతిలో తీర్చిదిద్దబోతున్నారు. చాలా తీవ్రస్థాయిలో భూకంపం వచ్చినప్పటికీ ఆలయం చెక్కుచెదరకుండా ఉండేవిధంగా నిర్మించబోతున్నారు. మరో విశేషమేమిటంటే ఈ ఆలయ నిర్మాణంలో ఎక్కడా ఇనుము వాడరు. రాజస్థాన్‌లో మాత్రమే దొరికే ప్రత్యేకమైన ‘శాండ్ స్టోన్’తో ఆలయాన్ని నిర్మించబోతున్నారు. 

అయోధ్య రామాలయంలో మొత్తం మూడు అంతస్తులు ఉంటాయి. మొదటి అంతస్తులో 160, రెండో అంతస్తులో 132, మూడవ అంతస్తులో 74 స్తంభాలు ఉంటాయి. ఆలయానికి 5 ప్రవేశద్వారాలు, 5మండపాలు, 5 గుమ్మటాలు ఉంటాయి. అయోధ్యలో నిర్మిస్తున్న ఈ ఆలయంలో శ్రీరాముడు కోదండంరాముడిగా దర్శనమిస్తాడు. 

ఆలయ ప్రాంగణం విస్తీర్ణం మొత్తం 67 ఎకరాలు కాగా దానిలో 2.77 ఎకరాలలో ప్రధాన మందిరం విస్తరించి ఉంటుంది. ఆలయ ఆవరణలో వేదపాఠశాల, యాత్రీనివాస్, గోశాల, ధర్మశాల, సంత్ నివాస్, ఉపన్యాసవేదికలు వేర్వేరుగా ఉంటాయి. ఒకేసారి 10,000 మంది భక్తులు దర్శించుకొనే విధంగా ఆలయ నిర్మాణం ఉంటుంది. ఆలయ ఆవరణలో ప్రార్ధనలు, ప్రవచనాల కోసం ఖాళీ స్థలం  ఉంటుంది. దీనిలో లక్షమంది కూర్చోవచ్చు.

అయోధ్య రామాలయం కోసం అనేక సంవత్సరాలుగా రాతి స్తంభాలు, పలకాలను చెక్కుతున్నారు. ఇప్పటివరకు సుమారు 50 శాతం చెక్కడం పనులు పూర్తయ్యాయి. ఇప్పుడు ఆలయానికి శంఖుస్థాపన జరిగిపోయింది కనుక మూడున్నర సంవత్సరాలలో ఆలయ నిర్మాణం పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకొని ట్రస్ట్ పనులు జరిపిస్తోంది.

Related Post