ఘనంగా రామమందిరం శంఖుస్థాపన

August 05, 2020
img

అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి ప్రధాని నరేంద్రమోడీ ఈరోజు భూమిపూజ చేశారు. ముందుగా అయోధ్యలో హనుమాన్ గడీకి వెళ్ళి అక్కడ అంజనేయస్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం గర్భగుడి నిర్మించబోయే ప్రాంతంలో 5 వెండి ఇటుకలను నక్షత్రాకారంలో ఉంచి శంఖుస్థాపన చేశారు. హరిద్వార్ నుంచి తెచ్చిన గంగాజలంతో పాటు దేశంలో వివిద రాష్ట్రాల నుంచి తెచ్చిన నదీ జలాలను ఈ కార్యక్రమంలో వినియోగించారు. తరువాత రామమందిరం నిర్మాణాని ప్రారంభాన్ని సూచించే శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. 

ఈ కార్యక్రమంలో యూపీ గవర్నర్‌ ఆనందీ బెన్, యూపీ సిఎం యోగీ ఆధిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, రాంమందిర్ ట్రస్ట్ ఛైర్మన్ సంత్ నిత్య గోపాల్ దాసోజు శ్రవణ్‌ తదితరులు పాల్గొన్నారు.   

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగిస్తూ, ఇటువంటి గొప్ప కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగినందుకు నా జన్మ తరించిందని నేను భావిస్తున్నాను. నాకు ఇటువంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు ట్రస్ట్ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. అయోధ్యలో రామ మందిరం కోసం ఎందరో త్యాగాలు చేశారు. వారందరికీ 135 కోట్ల మంది భారతీయుల తరపున కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. దేశవ్యాప్తంగా కోట్లాదిమంది భారతీయులు ఈ శుభదినం కోసం దశాబ్ధాలుగా ఎదురుచూస్తున్నారు. ఇన్నాళ్లకు వారి కల నెరవేరడంతో ఇవాళ్ళ దేశమంతా రామనామస్మరణతో మారుమ్రోగిపోతోంది. ఈ కలియుగంలో మానవులు సుఖసంతోషలతో జీవనం సాగించాలంటే శ్రీరాముని ఆదర్శాలను ఆచరణలో పాటించవలసి ఉంటుంది. నేపాల్, శ్రీలంక, కాంబోడియా, మలేషియా, థాయ్ లాండ్ తదితర దేశాలలో కూడా సీతారాముల కధలు నేటికీ వినిపిస్తుంటాయి. సీతారాముల ఆలయాలున్నాయి. అంటే రాముడు అందరివాడని అర్ధమవుతోంది. అనేక ఏళ్ళుగా ఇక్కడ ఓ చిన్న టెంటులో ఉన్న సీతారాములవారు భవిష్యత్‌లో ఓ దివ్యమైన ఆలయంలో మనకు దర్శనమివ్వబోతున్నారు,” అని అన్నారు. 

Related Post