అయోధ్య రామమందిరానికి నేడే శంఖుస్థాపన

August 05, 2020
img

హిందువుల ఆరాధ్యదైవం శ్రీరాముడి జన్మస్థలమైన యూపీలోని అయోధ్యలో ఇవాళ్ళ ప్రధాని నరేంద్రమోడీ రామమందిర నిర్మాణపనులకు భూమిపూజ చేసి శంఖుస్థాపన చేయబోతున్నారు. ఇవాళ్ళ మధ్యాహ్నం 12.30 గంటలకు భూమిపూజ చేసి 12.40 గంటలలోపు శంఖుస్థాపన చేస్తారు. కరోనా భయల నేపధ్యంలో ఈ కార్యక్రమానికి కేవలం 175 మంది ప్రముఖులను మాత్రమే ఆహ్వానించారు. భూమిపూజ, శంఖుస్థాపన కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీతో కలిపి కేవలం ఐదుగురే పాల్గొంటారు. 

అయోధ్యలో రామమందిరం నిర్మాణం మొదలవుతోందని తెలియగానే స్థానిక ప్రజలు చాలా ఆనందోత్సాహలతో పండుగ చేసుకొంటున్నారు. తమ ఇళ్లకు కొత్తరంగులు వేసుకొని, విద్యుదీపాలతో అలంకరించుకొన్నారు. అయోధ్య ఆలయాలలో గతం వారం రోజులుగా నిర్విరామంగా భజనలు, ప్రత్యేక పూజలు చేస్తున్నారు.  

జిల్లా యంత్రాంగమంతా అయోధ్య పట్టణాన్ని శుభ్రపరిచి, విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించడంతో అయోధ్య పట్టణం ధగధగా మెరిసిపోతోంది. అయితే కరోనా కారణంగా అయోధ్య నగరంలో నివశిస్తున్న స్థానిక ప్రజలెవరూ ఈరోజు జరుగబోయే శంఖుస్థాపన కార్యక్రమం చూసేందుకు రావద్దని అధికారులు చెప్పారు. ఆ కార్యక్రమం టీవీలో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది కనుక దానిని చూస్తూ ఇళ్లలోనే దీపాలు వెలిగించి పూజలు జరుపుకోవాలని కోరారు. 

ప్రధాని నరేంద్రమోడీ, యూపీ గవర్నర్‌ ఆనందీ బెన్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్, రామమందిర్ ట్రస్ట్ ఛైర్మన్ మహంత్ నిత్య గోపాల్ దాస్, బిజెపి సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కనుక అయోధ్యతో సహా చుట్టుపక్కల గల 9 జిల్లాలలో భారీగా పోలీసులను మోహరించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

Related Post