సున్నం రాజయ్య, వంగపండు మృతి

August 04, 2020
img

భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య (59), ఏపీలో విజయనగరం జిల్లాకు చెందిన ప్రముఖ జానపద కళాకారుడు వంగపండు ప్రసాదరావు (77) మృతి చెందారు. వారిలో సున్నం రాజయ్య సీపీఏం నేతకాగా, వంగపండు ప్రసాదరావు వామపక్ష భావజాలంతో కూడిన జానపద పాటలు రచించి ఆడిపాడేవారు. ఇద్దరూ కొన్ని గంటల వ్యవధిలో మృతి చెందారు. 

సున్నం రాజయ్యకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అవడంతో కుటుంబ సభ్యులు ఆయనను విజయవాడలో ఆసుపత్రికి అంబులెన్సులో తరలిస్తుండగా దారిలోనే చనిపోయారు. సున్నం రాజయ్య 1999,2004, 2014లో మూడుసార్లు సీపీఎం తరపున భద్రాచలం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. శాసనసభలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తుండేవారు. నియోజకవర్గం ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారిస్తుండేవారు.

వంగపండు ప్రసాదరావు విజయనగరం జిల్లాకు చెందిన వారైనప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చిరపరిచితుడు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన ఈరోజు తెల్లవారుజామున విజయనగరం జిల్లాలోని పెదబొందపల్లి గ్రామంలో తన నివాసంలో  కనుమూశారు. వంగపండు ప్రసాదరావు 1972లో జననాట్యమండలిని స్థాపించి దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో తన బృందంతో జానపదగేయ ప్రదర్శనలు ఇచ్చారు. గిరిజనులు, గ్రామీణ ప్రజలకు సైతం అర్ధమయ్యే  విధంగా అత్యంత సరళమైన బాషలో జానపద గేయాలు రచించి స్వరపరిచి ప్రదర్శనలు ఇచ్చేరు. సామాన్య ప్రజలు...ముఖ్యంగా గిరిజనులు నిత్యజీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు ఆయన పాటలలో ప్రతిధ్వనించేవి. ఆయన పాటలు 10  బాషలలోకి అనువదించబడ్డాయంటే అవి ఎంత ప్రజాధారణ పొందాయో అర్ధం చేసుకోవచ్చు. 1977లో ఆయనకు కళారత్న పురస్కారం అందుకొన్నారు. 

విప్లవకవి గద్దర్ వంగపండు మృతిపై స్పందిస్తూ, “ప్రజల గొంతు వినిపించే ఓ స్వరం మూగపోయింది. ఆయనపాటలు ప్రజల గుండె చప్పుళ్ళు. అక్షరం ఉన్నతవరకు ఆయన ప్రజల గుండెల్లో ఉంటారు,” అని నివాళులు అర్పించారు.

Related Post