మంచిర్యాల జిల్లాలో దారుణం

August 01, 2020
img

మంచిర్యాల జిల్లాలో భూతవైద్యుడు ఓ బాలింతను కుటుంబ సభ్యుల ఎదుటే చిత్రహింసలు పెట్టాడు. అతని దెబ్బలకు తట్టుకోలేక ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవడంతో కుటుంబ సభ్యులు ఆమెను కరీంనగర్‌లో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. 

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కుందారంకు చెందిన మల్లేశం, కరీంనగర్‌ జిల్లా శంకరపట్నంలోని గడ్డపాక గ్రామానికి చెందిన రజితకు సుమారు ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. నాలుగు నెలల క్రితమే వారికి ఓ పాప జన్మించింది. కానీ పాపకు జన్మనిచ్చినప్పటి నుంచి ఆమెకు పత్యం పేరిట సరైన పోషకాహారం ఇవ్వకపోవడంతో ఆమె చాలా బలహీనంగా మారి తరచూ అనారోగ్యానికి గురవుతుండేది. దాంతో పాపను తీసుకొని కొన్ని రోజులు పుట్టింటికి వెళ్ళివస్తానని భర్తను అడుగుతుండేది. ఆమెకు దయ్యం పట్టి ఈవిధంగా ప్రవర్తిస్తోందనే అనుమానంతో ఆమె కుటుంబ సభ్యులు ఓ భూతవైద్యుడిని ఆశ్రయించారు. 

అతను కుందారం వచ్చి రజితను ఆమె కుటుంబ సభ్యుల ఎదుటే జుట్టు పట్టుకొని ఇష్టం వచ్చినట్లు కొడుతూ, బూతులు తిడుతూ చిత్రహింసలు పెట్టాడు. “ఏమే వదిలిపెట్టి పోతావా పోవా... లేకపోతే కాలికిందేసి తొక్కి పారేస్తానంటూ బెదిరించాడు. ఆ దెబ్బలకు, బెదిరింపులకు భయపడి రజిత పోతానని ఒప్పేసుకొంది. అయినా ఆమెను విడిచిపెట్టలేదు. ‘మళ్ళీ వస్తావా...మళ్ళీ వస్తావా...” అంటూ ఆమె జుట్టు పట్టుకొని ఎడాపెడా గట్టిగా చెంపలు వాయించేడు. అసలే చాలా బలహీనంగా ఉన్న రజిత ఆ దెబ్బలకు తాళలేక అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. అది గమనించిన భూతవైద్యుడు ఆమెకు పట్టిన దయ్యం వదిలిపోయిందని చెప్పి వారి వద్ద డబ్బులు తీసుకొని వెళ్లిపోయాడు. 

రజిత ఎంతసేపటికి లేవకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. దాంతో ఈ విషయం బయటపడింది. కరీంనగర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని రజితను చిత్రహింసలు పెట్టిన భూతవైద్యుడి కోసం గాలిస్తున్నట్లు సమాచారం.

Related Post