హజ్ యాత్రపై కరోనా ప్రభావం: విదేశీయులకు నో ఎంట్రీ

July 31, 2020
img

భగవంతుడి గురించి చెప్పుకొనేటప్పుడు సర్వాంతర్యామి అనే పదం తరచూ వింటుంటాము. కరోనా మహమ్మారి మాత్రం సర్వాంతర్యామిలా వ్యాపించింది. కరోనా కూడా భగవంతుడిలాగే కంటికి కనిపించకుండా అంతటా తన ప్రభావాన్ని చూపిస్తోంది. దానికి కులమతాలు, బాషలు ప్రదేశాలతో సంబందం లేదు. అంతటా వ్యాపించి అందరినీ కమ్ముకొంటోంది. హజ్ యాత్రపై కూడా తన ప్రభావం చూపిస్తోంది.      

ప్రపంచవ్యాప్తంగా ముస్లింలందరూ జీవితంలో ఒక్కసారైనా మక్కా వెళ్లాలని కోరుకొంటుంటారు. కనుక ఏటా సుమారు ముప్పై లక్షలమందికి పైగా హజ్ యాత్రలో భాగంగా మక్కాకు వెళ్ళివస్తుంటారు. కానీ ఈసారి కరోనా కారణంగా సౌదీ అరేబియా ప్రభుత్వం కేవలం 10,000 మంది విదేశీయులను మాత్రమే అనుమతిస్తోంది. దాంతో హజ్ యాత్రికులతో కళకళలాడవలసిన మక్కా నగరం బోసిపోయింది. సాధారణంగా సుమారు లక్ష మందికి పైగా భక్తులు ఒకేసారి కాబా  ప్రదక్షిణలో పాల్గొంటారు. కానీ ఇప్పుడు విదేశీయులు లేకపోవడం, ఉన్నకొద్దిమందీ భౌతికదూరం పాటించవలసిరావడంతో ఆ ప్రాంతమంతా ఖాళీగా కనిపిస్తోంది. 


హజ్ యాత్రికుల ద్వారా ఇతరులకు కరోనా సోకే ప్రమాదం ఉంది కనుక తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకొని కరోనా లేదని నిర్ధారణ అయితేనే మక్కాలోకి అనుమతిస్తున్నారు అధికారులు. అయినా కూడా మక్కాలో అడుగుపెట్టగానే మళ్ళీ మరోసారి కరోనా పరీక్షలు చేసి నెగెటివ్ అని నిర్ధారణ అయితేనే కాబా ప్రదక్షిణకు అనుమతిస్తున్నారు. 


సుమారు 35,000 మంది సిబ్బంది మక్కా మసీదు పరిసర ప్రాంతాలను రోజుకు ఐదారుసార్లు శుభ్రం చేస్తున్నారు. దాంతో ఇప్పుడు హజ్ యాత్రికుల కంటే పారిశుద్యకార్మికులే అక్కడ ఎక్కువగా కనిపిస్తున్నారు. వచ్చే ఏడాది హజ్ యాత్ర మొదలయ్యేలోగా ప్రపంచం కరోనా మహమ్మారి నుంచి విముక్తి పొందితే మళ్ళీ అన్ని దేశాల నుంచి హజ్ యాత్రికులను అనుమతిస్తామని సౌదీ ప్రభుత్వం చెపుతోంది. ఇన్షా అల్లాహ్!

Related Post