రానున్న రోజులు మరింత గడ్డుకాలం: జోగిని స్వర్ణలత భవిష్యవాణి

July 13, 2020
img

ఆనవాయితీ ప్రకారం ఈ ఏడాది కూడా సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి మందిరం ముందు జోగిని స్వర్ణలత భవిష్యవాణి చెప్పారు. రానున్న రోజులు మరింత గడ్డుకాలమని హెచ్చరించారు. కరోనా కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలకు కారణం స్వీయకృతాపరాధమేనని, ఖర్మ ఫలం అనుభవించక తప్పదని స్పష్టం చేశారు. కరోనా గురించి ఆలయ ప్రధాన పూజారి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం చెపుతూ, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని జోగిని స్వర్ణలతా హెచ్చరించారు. భక్తుల పూజలతో తాను సంతృప్తి చెందానని వారిని తప్పకుండా కాపాడుతానని అన్నారు. రాష్ట్రంలో గడప గడప నుంచి తనకు పప్పు బెల్లాలతో 5 వారాలపాటు నైవేద్యం సమర్పించాలని కోరారు. అలాగే తప్పనిసరిగా మారుబోనం సమర్పించాలని కోరారు. 

ఈ సందర్భంగా ఆలయ ప్రధానపూజారి తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా సమాధానం రప్పించేందుకు ప్రయత్నించడం విస్మయం కలిగిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రాజెక్టులు నిర్మించి రాష్ట్ర ప్రజలకు నీటిని అందిస్తోందని, దానిపై మీ అభిప్రాయం చెప్పమని కోరడం విచిత్రంగా ఉంది. ఆ ప్రశ్నకు ఆమె సానుకూలంగా స్పందిస్తూ, ప్రభుత్వం చేసిన పనులు బాగున్నాయని, గంగాదేవికి జలాభిషేకం చేసి బోనం సమర్పించాలని కోరారు. 

Related Post