గ్యాంగ్‌స్టర్‌ వికాస్ దుబే ఖతం

July 10, 2020
img

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో కరుడుగట్టిన నేరస్థుడు వికాస్ దూబే గురువారం ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. ఈ నెల 3వ తేదీన డీఎస్పీ దేవేంద్ర మిశ్రా నేతృత్వంలో ముగ్గురు సబ్‌ఇన్స్‌పెక్టర్లు, నలుగురు కానిస్టేబుల్స్ వికాస్ దుబేను అరెస్ట్ చేసేందుకు బయలుదేరారు. కానీ పోలీస్ శాఖలో కొందరు దూబేకు ఈవిషయం ముందుగా తెలియజేయడంతో, అతను తన అనుచరులతో కలిసి కాపుకాసి తనను అరెస్ట్ చేయడానికి వచ్చిన డీఎస్పీ దేవేంద్ర మిశ్రాతో మొత్తం 8 మందిని కాల్చి చంపాడు. తనను అరెస్ట్ చేసే సాహసం చేసినందుకు ప్రతీకారంగా డీఎస్పీ దేవేంద్ర మిశ్రా తల నరికి అతికిరాతకంగా హత్యచేశాడు. డీఎస్పీతో సహా 8మంది పోలీసులను వికాస్ దూబే హత్య చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 

యూపీ సిఎం యోగి ఆధిత్యనాథ్ కూడా ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, వికాస్ దూబేను, అతని అనుచరులను వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించారు. తమ సహచరుల హత్యలకు ప్రతీకారంతో రగిలిపోతున్న యూపీ పోలీసులు, గత వారం రోజులుగా దూబే, అతని అనుచరుల కోసం గాలింపు మొదలుపెట్టారు. ఈ సందర్భంగా వికాస్ దూబే అనుచరులలో ఐదుగురిని ఎన్‌కౌంటర్‌ చేశారు. మరో 12 మందిని అరెస్ట్ చేశారు. 

వికాస్ దూబే పోలీసులను హత్య చేసిన తరువాత మధ్యప్రదేశ్ పారిపోయాడు. అక్కడ ఉజ్జయినీలో మహంకాలేశ్వర్ ఆలయం వద్ద మారువేషంలో తిరుగుతుండగా ఓ వ్యక్తి అతనిని గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చాడు. స్పెషల్ టాస్క్ పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని అతనిని అరెస్ట్ చేసి భారీ భద్రత నడుమ కాన్పూర్ తరలిస్తుండగా, కాన్పూర్ సమీపంలో అతనిని తరలిస్తున్న వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. అదే అదునుగా అతను కానిస్టేబుల్ దగ్గర తుపాకీ లాక్కొని పోలీసులపై కాల్పులు జరుపుతూ తప్పించుకొని పారిపోవాలని ప్రయత్నించగా పోలీసుల ఎదురుకాల్పులలో అతను చనిపోయాడు. వికాస్ దూబేపై 60కి పైగా క్రిమినల్ కేసులున్నాయి. కానీ రాజకీయనాయకులు, పోలీసులు, అధికారుల అందండలతో ఎప్పటికప్పుడు జైలు నుంచి బయటపడుతుండేవాడు. కనుక ఈసారి పోలీసులు అతనికి ఆ అవకాశం లేకుండా చేశారనుకోవచ్చు.

Related Post