యాదాద్రిలో గర్భిణి స్త్రీ మృతి...కరోనా పాజిటివ్

June 03, 2020
img

యాదాద్రి భువనగిరి జిల్లాలో 23సం.ల వయసున్న సంతోష అనే గర్భిణీ స్త్రీ కరోనాతో మృతి చెందింది. జిల్లాలోని రాజాపేట మండలంలోని దూదివెంకటాపురం గ్రామానికి చెందిన ఎర్రోళ్ళ నాగరాజు భార్య సంతోష. కొన్ని నెలల క్రితం ఆమె గర్భం దాల్చడంతో ఒకటిన్నర సం.ల వయసున్న పసిపాపను వెంటపెట్టుకొని జనగామ జిల్లా బచ్చన్నపేటలో పుట్టింటికి వచ్చింది. 

వారం రోజుల క్రితం ఆమెను జనగామ ఎంసీహెచ్ ఆసుపత్రికి వెళ్ళి పరీక్షలు చేయించుకోగా, ఆమెకు రక్తహీనత ఉన్నట్లు గుర్తించినా వైద్యులు హైదరాబాద్‌ ఉస్మానియా ఆసుపత్రికి రిఫర్ చేశారు. కానీ కుటుంబ సభ్యులు ఆమెను ఉస్మానియా ఆసుపత్రికి తీసుకువెళ్లకుండా గత నెల 29న హన్మకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. అప్పటికే ఆమె ఆరోగ్యపరిస్థితి ఆందోళనకరంగా మారింది. దాంతో వైద్యులు ఆమెకు రక్తం ఎక్కించి మే 31న ఉస్మానియా ఆసుపత్రికి పంపించారు. 

ఆదేరోజు రాత్రి ఆమె మగశిశువును ప్రసవించింది కానీ శిశువు పుట్టగానే మరణించాడు. మరుసటిరోజు మధ్యాహ్నం 3 గంటలకు సంతోష పరిస్థితి కూడా విషమించి చనిపోయింది. తల్లీ, బిడ్డా ఇద్దరూ చనిపోవడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న ఆమె కుటుంబ సభ్యులకి వైద్యులు మరో షాకింగ్ వార్త చెప్పారు. చనిపోయిన సంతోషకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లు చెప్పడంతో కుటుంబ సభ్యులు దిగ్బ్రాంతి చెందారు. దాంతో తల్లీ బిడ్డల అంత్యక్రియలు చేయడానికి కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి.

సంతోష మరణంతో జిల్లాలో తొలి కరోనా మరణం నమోదైంది. దీంతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది సంతోష కుటుంబ సభ్యులందరినీ బీబీ నగర్ లోని క్వారెంటైన్‌కు తరలించి అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. అంతకు ముందు ఆమె వెళ్ళిన మూడు ఆసుపత్రులలో ఆమెకు చికిత్స చేసిన వైద్యులు, వైద్య సిబ్బందికి అందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Related Post