మెదక్ జిల్లాలో బోరుబావిలో పడిన బాలుడు

May 27, 2020
img

బోరుబావుల విషాదగాధలు ఎన్నిసార్లు వింటున్నా బోరుబావులు తవ్వే సంస్థలు కానీ, వాటిని తవ్వించుకొంటున్న రైతులలో అదే అలసత్వం... నిర్లక్ష్యం కొనసాగుతోంది. అందుకే ఆ విషాదగాధలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. 

మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని పోడ్చనపల్లి గ్రామంలో ఈరోజు మధ్యాహ్నమే తవ్విన ఓ బోరుబావిలో సాయివర్ధన్ అనే మూడేళ్ళ బాలుడు పడిపోయాడు. సంగారెడ్డిలో నివాసం ఉంటున్న మంగలి గోవర్ధన్, నీలిమ దంపతుల 3వ కుమారుడే సాయి వర్ధన్. నాలుగు నెలల క్రితం పోడ్చనపల్లిలో ఉంటున్న సోదరుడు మంగలి బిక్షపతి ఇంటికి వారు వచ్చారు. అదే పొలంలో ఇప్పటికే మూడు బోర్లు వేయగా వేటిలోనూ నీళ్ళు పడకపోవడంతో ఈరోజు నాలుగవ బోరును తవ్వించారు. సుమారు 120 అడుగుల లోతు తవ్వినప్పటికీ నీళ్ళు పడకపోవడంతో తీవ్ర నిరాశ చెందిన బిక్షపతి ఆ బోర్లను మూయకుండా అలాగే వదిలేశాడు. అదే సమయంలో అక్కడ ఆడుకొంటున్న సాయి వర్ధన్ బోరుబావిలో పడిపోయాడు. 

సమాచారం అందుకొన్న మెదక్ రూరల్ ఎస్సైలు రాజశేఖర్, ఆంజనేయులు, స్థానిక పోలీసులు, జిల్లా కలక్టర్, అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకొని సహాయ చర్యలు మొదలుపెట్టారు. బోరుబావిలోకి ఆక్సిజన్ పంపిస్తూ, బావికి సమాంతరంగా జేసీబీతో గొయ్యి తవ్విస్తున్నారు. బాలుడిని బయటకు తీసేవరకు సహాయ చర్యలు కొనసాగించేందుకు వీలుగా లైట్లు, ఆక్సిజన్ సిలిండర్లు వగైరా ఏర్పాటు చేశారు. బాలుడి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకొనేందుకు అవసరమైన కెమెరాలు, ఇతర పరికరాలను హైదరాబాద్‌ నుంచి రప్పించారు. 

బాలుడి తల్లితండ్రులు, బందువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ బాబు క్షేమంగా బయటపడాలని దేవుళ్ళకు మొక్కుతున్నారు. బాలుడు సుమారు 25 అడుగుల లోతులో చిక్కుకొన్నట్లు తెలుస్తోంది. పరిస్థితి గురించి ఇంకా తెలియవలసి ఉంది. ఈ నెలలో పోడ్చనపల్లిలో అనధికారికంగా మొత్తం 19 బోర్లు వేసినట్లు సమాచారం. 

Related Post