ఒక్క పార్టీతో హైదరాబాద్‌లో 22 మందికి కరోనా!

May 27, 2020
img

కరోనా వ్యాపించకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ప్రసారసాధనాలలో రెండు నెలలుగా హోరెత్తిస్తున్నప్పటికీ కొంతమందిలో నేటికీ అవగాహన కొరవడుతుండటం ఆశ్చర్యకరం. హైదరాబాద్‌లో పహాడీషరీఫ్ లో ఓ మటన్ వ్యాపారి 10 రోజుల క్రితం తన బందుమిత్రులకు తన ఇంట్లో పార్టీ ఇచ్చాడు. దానిలో మొత్తం 42 మంది పాల్గొనగా వారిలో 22 మందికి కరోనా సోకింది. వారిలో కొందరు జియాగూడ, గౌలిపురా, బోరబండ, సంతోష్ నగర్, హర్షగూడ ప్రాంతాల నుంచి వచ్చారు. మటన్ వ్యాపారి కుటుంబంలో 13 మందికి, బోరబండ, సంతోష్ నగర్ నుంచి వచ్చిన 8 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దాంతో మిగిలిన 20 మందిని, వారి కుటుంబ సభ్యులను, వారి దుకాణాలకు వచ్చినవారిని, ఈ మద్య కాలంలో వారితో సన్నిహితంగా ఉన్నవారిని గుర్తించే పనిలోపడ్డారు పోలీసులు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది. ఇప్పటి వరకు గుర్తించినవారీనందరినీ హోమ్ క్వారెంటైన్‌లో ఉండాలని ఆదేశించారు. 

కరోనా వైరస్‌ను అరికట్టేందుకు జీహెచ్‌ఎంసీ, పోలీసులు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, వైద్యులు, వైద్య సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతుంటే, ఈవిధంగా కొందరు వ్యక్తులు బాధ్యతారహితంగా గెట్-టుగెదర్ పార్టీలు చేసుకొంటూ కరోనా వైరస్‌ను వ్యాపింపజేస్తుండటం చాలా శోచనీయం. బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న ఇటువంటి వారికి ప్రభుత్వం ఉచితంగా కరోనా పరీక్షలు, చికిత్సలు చేయవలసిన అవసరం ఏమిటి?సొంత ఖర్చులతో పరీక్షలు, ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్సలు చేయించుకోమని ప్రభుత్వం చెప్పగలిగితే మళ్ళీ ఎవరూ ఇటువంటి ఆలోచనలు కూడా చేయరు.

Related Post