ఒక హత్యను దాచడానికి 9 హత్యలు!

May 25, 2020
img

సంచలనం సృష్టించిన గొర్రెకుంట పారిశ్రామికవాడలోని హత్య కేసులను వరంగల్‌ పోలీసులు చేదించి, హంతకుడు సంజయ్ కుమార్ యాదవ్‌ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వరంగల్‌ పోలీస్ కమీషనర్ రవీందర్ సమక్షంలో ఈరోజు హంతకుడు సంజయ్ కుమార్ యాదవ్‌ను మీడియా ముందు హాజరుపరిచారు. ఈ హత్యల వెనుక అసలు కారణాన్ని కమీషనర్ రవీందర్ వివరించారు. అయితే మీడియాలో వచ్చినట్లు సంజయ్‌కు మక్సూద్ ఆలం కుమార్తెతో కాక మక్సూద్ భార్య అక్క కూతురు రఫీకా(31) అక్రమ సంబందం ఈ హత్యలకు ప్రధానకారణమని తేలింది.    

సంజయ్ కుమార్ యాదవ్‌కు హతుడు మహ్మద్ మక్సూద్ ఆలం కుటుంబ సభ్యులతో చాలా కాలంగా పరిచయం ఉంది. భర్త నుంచి విడిపోయి ముగ్గురు పిల్లలతో ఒంటరిగా ఉంటున్న మక్సూద్ భార్య అక్క కూతురు రఫీకా(31) పరిస్థితిని ఆసరాగా తీసుకొని సంజయ్ మాయమాటలు చెప్పి ఆమెను శారీరికంగా లోబరుచుకొన్నాడు. ఆ తరువాత వారిరువురూ సహజీవనం కూడా చేశారు. అయితే రఫీకా కూతురిపై కూడా సంజయ్ కన్నేయడంతో వారి మద్య గొడవలు మొదలయ్యాయి. దాంతో రఫీకాను వదిలించుకోవాలని భావించిన సంజయ్, ఆమెకు మాయమాటలు చెప్పి రైల్లో విశాఖకు బయలుదేరదీసి నడుస్తున్న రైల్లో నుంచి తోసేసి తిరిగి వరంగల్‌ చేరుకొన్నాడు. 

కానీ మక్సూద్ భార్య తనను రఫీకా గురించి నిలదీస్తుందని ఊహించకపోవడంతో సంజయ్ కొత్త సమస్యలో ఇరుకొన్నాడు. ఈ సంగతి ఆమె ఎవరికైనా చెపితే తాను జైలుకు వెళ్ళవలసి వస్తుందని భావించిన సంజయ్ ఆమెను కూడా వదిలించుకోవాలని నిర్ణయించుకొన్నాడు. అయితే ఆమె ఒక్కర్తిని చంపినా మళ్ళీ ఇదే సమస్య పునరావృతం అవుతుంటుందని భావించిన సంజయ్, మక్సూద్ కుటుంబంలో ఆరుగురినీ హతమార్చాలని నిర్ణయించుకొన్నాడు. ఈ నెల 21న మక్సూద్ దంపతుల కుమారుడి పుట్టినరోజు వేడుకకు హాజరైన సంజయ్, వారు తయారు చేసుకొన్న ఆహారంలో 60 నిద్రమాత్రలు కలిపేడు. 

అదే భవనంలో నివశిస్తున్న బీహార్‌కు చెందిన రామ్, శ్యామ్ అనే ఇద్దరు వ్యక్తులు కూడా తనను గుర్తుపట్టే ప్రమాదం ఉందని భావించిన సంజయ్ వారి ఆహారంలో కూడా మత్తు మందు కలిపాడు. ఆ కార్యక్రమానికి హాజరైన మరో వ్యక్తికి కూడా ఆ ఆహారం తిన్నాడు. వారందరూ మత్తులో జారుకొన్నాక సంజయ్ కుమార్ ఒక్కొక్కరినీ మేడపైకి మోసుకువెళ్ళి పక్కనే ఉన్న బావిలో పడేశాడు. అపస్మారక స్థితిలో ఉన్న వారందరూ నీళ్ళలో ఊపిరాడక చనిపోయారు. అంతకు ముందు నడుస్తున్న రైల్లో నుంచి రఫీకాను బయటకు తోసేసే ముందు ఆమెకు కూడా మజ్జిగలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చినట్లు సంజయ్ పోలీసులకు చెప్పాడు. ఒక హత్యను దాచిపుచ్చడానికి తొమ్మిదిమందిని హత్యలు చేయడం చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు.   

ఈ కేసును సవాలుగా తీసుకొన్న వరంగల్‌ పోలీసులు ఆరు బృందాలుగా ఏర్పడి సిసికెమెరాలు, సెల్ ఫోన్‌ కాల్ డాటా, ఘటన స్థలంలో లభించిన ఆధారాలతో సంజయ్ కుమార్ యాదవ్‌ను అరెస్ట్ చేశారు. ఈ హత్యలలో అతనికి సహకరించినవారి కోసం గాలిస్తున్నారు. పోలీసులు రేపు వరంగల్‌ జిల్లా కోర్టులో సంజయ్ కుమార్ యాదవ్‌ను హాజరుపరచనున్నారు.   


Related Post