గొర్రెకుంట మర్డర్ మిస్టరీని చెందించిన వరంగల్‌ పోలీసులు

May 25, 2020
img

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్‌ రూరల్ జిల్లాలో గొర్రెకుంట మర్డర్ మిస్టరీని పోలీసులు చెందించారు. వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలంలో గొర్రెకుంట వద్ద గల ఓ పారిశ్రామికవాడలో గోనె సంచులు కుట్టుకొని జీవిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురితో పాటు మరో ముగ్గురి శవాలు సమీపంలో ఓ పాడుబడిన బావిలో గత బుద,గురువారాలలో లభ్యమైన సంగతి తెలిసిందే. వారందరినీ ఓ పధకం ప్రకారం హత్య చేసిన సంజయ్ కుమార్ యాదవ్‌ను కాల్ డాటా ఆధారంగా పోలీసులు పట్టుకొన్నారు. అతను నేరాన్ని అంగీకరించాడని పోలీసులు తెలిపారు. 

ఈ కేసులో హత్యకు గురైన మహ్మద్ మక్సూద్ ఆలం దంపతుల కుమార్తె బుష్రా ఖాతూన్‌, హంతకుడు సంజయ్ కుమార్ యాదవ్ మద్య ప్రేమ వ్యవహారం సాగుతున్నట్లు సమాచారం. అదే ఈ హత్యలకు ప్రధాన కారణమని తెలుస్తోంది. 

గత బుదవారం రాత్రి మక్సూద్ ఆలం కుమారుడు సోహిల్ ఆలం పుట్టినరోజు సందర్భంగా వారి ఇంట్లో జరిగిన విందుకు హాజరైన సంజయ్ కుమార్ యాదవ్ వారందరికీ కూల్ డ్రింక్స్ లో మత్తుమందు కలిపి ఇచ్చి, వారు అపస్మారక స్థితికి చేరుకొన్నాక, తన స్నేహితుల సాయంతో ఒక్కొక్కరినీ మేడపైకి తీసుకువెళ్ళి, పక్కనే ఉన్న పాడుబడిన బావిలో పడేసాడు. 

హత్య జరిగిన రోజున సంజయ్ అతని స్నేహితుల కాల్ డాటా, వారందరూ స్థానిక వెంకట్రామ థియేటర్‌ చౌరస్తా వద్ద కలిసి మాట్లాడుకొంటుండగా సిసి కెమెరాలలో రికార్డ్ అయిన దృశ్యాలు, ఫోరెన్‌సిక్ నివేదిక, ఘటనా స్థలంలో లభించిన కొన్ని ఆధారాల ద్వారా సంజయ్ కుమార్ యాదవ్ ఈ హత్యలలో ప్రధాన సూత్రధారి అని పోలీసులు గుర్తించారు. ఈ కేసును సవాలుగా తీసుకొన్న పోలీసులు ఈ ఆధారాలతో సంజయ్ కుమార్ యాదవ్‌ను పట్టుకోగలిగారు. అతను ఇచ్చిన సమాచారంతో మిగిలినవారిలో కొంతమందిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్న సంజయ్ కుమార్ యాదవ్‌ను సోమవారం మధ్యాహ్నం మీడియా ముందు ప్రవేశపెట్టి, ఈ హత్యలు జరిగిన తీరు, హత్యలకు కారణం గురించి వివరించనున్నారు. 

Related Post