లాక్‌డౌన్‌లో వలస కార్మికులు మృతి!

May 22, 2020
img

వరంగల్ నగరంలోని కరీమాబాద్‌లో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బావిలో శవాలై తేలారు.  సుమారు రెండు దశాబ్ధాల క్రితం మహమ్మద్ మక్సూద్ ఆలం, నిషా ఆలం దంపతులు పశ్చిమబెంగాల్ నుంచి పొట్టచేత పట్టుకొని వరంగల్‌కు వచ్చి కరీమాబాద్‌లో చినిగిన గోనె సంచులు కుడుతూ బ్రతుకులు వెళ్ళదీస్తున్నారు. లాక్‌డౌన్‌ నేపద్యంలో నెలరోజుల క్రితం వారి కుటుంబం సమీపంలోని గొర్రెకుంటలో పారిశ్రామికవాడలో సాయిదత్త ట్రేడర్స్‌కు చెందిన ఓ గోదాములోకి మారి అక్కడే ఉంటూ పనిచేసుకొంటున్నారు. 

పోలీసుల సమాచారం ప్రకారం, గురువారం మహమ్మద్ మక్సూద్ ఆలం (50), నిషా ఆలం (45) దంపతులతో పాటు ఉంటున్న వారి కుమార్తె బుశ్రా ఖాతూన్ (20), ఆమె కుమారుడు (3) నలుగురి శవాలు సమీపంలో గల ఓ పాడుబడిన బావిలో కనిపించాయి. బావి పక్కనే వారి బట్టలు వగైరా మూటకట్టి ఉన్నాయి. మృతుల శరీరాలపై ఎటువంటి గాయాలు లేవు. దాంతో వారు ఆర్ధికసమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకొన్నారా లేక ఎవరైనా వారిని హత్య చేసి బావిలో పడేశారా? అనే విషయం ఇంకా తెలియవలసి ఉంది. వారితోపాటు కలిసి అక్కడే పనిచేస్తున్న మక్సూద్ ఆలం ఇద్దరు కుమారులు సోయల్ ఆలం, షాబాజ్ ఆలంలతో పాటు మరో ఇద్దరు బిహారీ కార్మికుల జాడ కూడా కనిపించడం లేదు. వారు కూడా చనిపోయారా లేక హత్య చేసి పారిపోయారో తెలియదు. కనుక పోలీసులు వారి ముగ్గురి కోసం గాలిస్తున్నారు. వారిని పట్టుకోగలిగితే ఈ మిస్టరీ వీడుతుందని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీం కూడా రంగంలో దిగి ఆధారాలు సేకరిస్తోంది. 

Related Post