భక్తులు లేకుండానే నేడు భద్రాద్రిలో శ్రీ సీతారామ కళ్యాణం

April 02, 2020
img

నేడు శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం, ఒంటిమిట్టతో సహా రెండు తెలుగు రాష్ట్రాలలో అన్ని వైష్ణవాలయాలలో భక్తులు లేకుండానే శ్రీ సీతారామ కల్యాణోత్సవం జరిపిస్తున్నారు. కరోనా భయంతో తొలిసారిగా ఈవిధంగా జరుగుతోంది. భక్తులను అనుమతించనప్పటికీ సీతారాముల కళ్యాణ వేడుకలను టీవీ ఛానల్స్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తుండటంతో భక్తులందరూ టీవీలలో చూసి తృప్తి పడవలసి వస్తోంది. భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహించబోయే  కళ్యాణమండపాన్ని అందంగా పూలతో అలంకరించారు. ఆనవాయితీ ప్రకారం తెలంగాణ ప్రభుత్వం తరపున దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శ్రీ సీతారాములకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.  భద్రాచలంలో జరుగబోయే శ్రీ సీతారామ కల్యాణోత్సవం ప్రత్యక్షంగా చూసేందుకు భక్తులు ఎవరూ రావద్దని జిల్లా అధికారులు విజ్ఞప్తి చేశారు. ఆలయానికి చేరుకొనే దారులన్నీ మూసివేశామని, ఆలయం చుట్టుపక్కల నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయని కనుక ఎవరినా వచ్చే ప్రయత్నం చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. ఈరోజు శ్రీ సీతారామ కల్యాణోత్సవం రేపు శ్రీరామపట్టాభిషేకం కార్యక్రమం నిర్వహిస్తారు.

Related Post