జనగామలో హైఅలర్ట్... ఐదుగురు ఆసుపత్రులకు తరలింపు

April 01, 2020
img

ఇటీవల ఢిల్లీ, నిజాముద్దీన్‌లో జరిగిన మతప్రార్థనలకు జనగామ జిల్లా నుంచి ఐదుగురు వ్యక్తులు వెళ్ళివచ్చినట్లు అధికారులకు సమాచారం అందడంతో వెంటనే అప్రమత్తమయ్యారు. నిజాముద్దీన్ వెళ్ళి వచ్చినవారు నర్మెట మండలంలో వెల్దండ గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. వెంటనే అధికారులు వెల్దండ గ్రామానికి చేరుకొని వారిని ప్రశ్నించగా తాము నిజాముద్దీన్ వెళ్ళలేదని చెప్పారు కానీ అధికారులు గట్టిగా నిలదీసి అడగడంతో ముగ్గురు మాత్రమే తిరిగివచ్చామని మరో ఇద్దరు నిజాముద్దీన్‌లోనే ఉండిపోయారని చెప్పారు. 

తాము మార్చి 17న డిల్లీ నుంచి హైదరాబాద్‌కు విమానంలో, అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా వెల్దండకు చేరుకొన్నామని చెప్పారు. తిరిగివచ్చిన వారిలో ఒకరు జిల్లా కేంద్రంలో ప్రభుత్వం పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తుంటే, మరొకరు జిల్లా గ్రామీణాభివృద్ధి కార్యాలయంలో పనిచేస్తున్నారు. మరొకరు మటన్, చికెన్ షాప్ నిర్వహిస్తున్నట్లు కనుగొన్నారు. కరోనా గురించి అవగాహన లేనందునో లేదా తమకు సోకలేదనే నిర్లక్ష్యంతోనో ముగ్గురూ వెల్దండ గ్రామానికి తిరిగివచ్చిన తరువాత చాలామందితో కలిసి తిరిగారు. మూడోవ్యక్తి యధాప్రకారం చికెన్, మటన్ అమ్మినట్లు అధికారులు గుర్తించారు. 

వారిలో కరోనా లక్షణాలు కనబడిన వ్యక్తిని, ఆయన భార్య, కుమారుడిని అధికారులు ప్రత్యేక అంబులెన్సులో సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రికి తరలించారు. మరో ఇద్దరినీ వరంగల్‌లో మహాత్మాగాంధీ ఆసుపత్రికి తరలించారు. వారి కుటుంబ సభ్యులందరినీ, వారితో సన్నిహితంగా మెలిగిన మరో 35 కుటుంబాలను తప్పనిసరిగా 14 రోజులు వారివారి ఇళ్లలోనుంచి బయటకు రావద్దని క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు ఆదేశించారు. ముందుజాగ్రత్త చర్యగా జిల్లా వైద్యబృందాలు వెల్దండలో ఇంటింటికీ వెళ్ళి సర్వే చేస్తున్నారు.

Related Post