ఏపీ, తెలంగాణ సరిహద్దుల వద్ద రాత్రంతా హైడ్రామా

March 26, 2020
img

బుదవారం ఉదయం నుంచి గురువారం తెల్లవారుజాము వరకు ఏపీ, తెలంగాణ సరిహద్దుల వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. హైదరాబాద్‌లో ప్రైవేట్ హాస్టల్స్ ఖాళీ చేయిస్తుండటంతో వాటిలో ఉంటున్న ఏపీకి చెందిన విద్యార్దులు, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు, ప్రైవేట్ సంస్థలలో పనిచేసే ఉద్యోగులు హైదరాబాద్‌ పోలీసుల అనుమతితో ఏపీకి సొంత వాహనాలలో బయలుదేరారు. కానీ వారందరూ  కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలంలో గరికపాడు వద్ద గల చెక్ పోస్టు చేరుకొన్నాక అక్కడ ఏపీ పోలీసులు వారిని అడ్డుకున్నారు. వారిలో కరోనా క్వారంటైన్ శిబిరాలకు వెళ్ళేందుకు అంగీకరించినవారిని, కరోనా లక్షణాలు లేవని హైదరాబాద్‌లో వైద్య దృవీకరణ పత్రాలు తెచ్చుకున్నవారిని మాత్రమే ఏపీలో ప్రవేశించడానికి అనుమతించారు. మిగిలినవారిని అనుమతించకపోవడంతో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బుదవారం ఉదయం నుంచే భారీ సంఖ్యలో విద్యార్దులు, ఉద్యోగులు ఏపీకి బయలుదేరడంతో సమయం గడిచే కొద్దీ చెక్ పోస్టువద్ద వారి సంఖ్య పెరిగిపోయింది. దాంతో నిన్న ఉదయం నుంచి ఈరోజు తెల్లవారుజాము వరకు వేలాదిమంది అక్కడే రోడ్లపై ఉండిపోయీ చాలా ఇబ్బందులు పడ్డారు. 

చెక్ పోస్టు వద్ద అంతకంతకూ పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతుండటంతో, ఏపీ, తెలంగాణ మంత్రులు బొత్స సత్యనారాయణ, కేటీఆర్‌, ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు నీలం సాహ్ని, సోమేష్ కుమార్‌ ఫోన్లో చర్చించుకొన్నారు. వారు ఈ సమస్యను ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకువెళ్ళడంతో నిన్న రాత్రి జగన్‌మోహన్‌రెడ్డి,  కేసీఆర్‌ ఫోన్లో మాట్లాడుకొని సమస్యను పరిష్కరించారు. 

హైదరాబాద్‌ నుంచి చెక్ పోస్టు వద్దకు చేరుకొన్న వారందరినీ క్వారంటైన్ శిబిరాలకు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించి ఏపీలోకి అనుమతించారు. అందుకు అంగీకరించనివారు హైదరాబాద్‌ తిరిగి వెళ్ళిపోయారు. ఇక నుంచి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఉన్న విద్యార్దులు, ఉద్యోగులను ఎక్కడివారు అక్కడే ఉంచుకోవాలని ఇరువురు ముఖ్యమంత్రులు నిర్ణయించారు. హైదరాబాద్‌లో ప్రైవేట్ హాస్టల్స్ ఖాళీ చేయించరాదని, ఒకవేళ ఎవరైనా అటువంటి ప్రయత్నం చేస్తే హాస్టల్ యజమానులపై చట్టప్రకారం చర్యలు తీసుకొంటామని డిజిపి మహేందర్ రెడ్డి హెచ్చరించారు.

Related Post