లాక్‌డౌన్‌ సమయంలో రోడ్లపైకి వస్తే భారీ జరిమానాలు?

March 23, 2020
img

నేటి నుంచి ఈనెల 31వరకు తెలంగాణ అంతటా లాక్‌డౌన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ హైదరాబాద్‌ నగరంలో ఈరోజు ఉదయం నుంచి భారీ సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చారు. రోడ్లపై ఎక్కడ చూసినా వాహనాలే కనిపించాయి. దాంతో ప్రభుత్వం, పోలీస్ అధికారులు అప్రమత్తమయ్యారు. డిజిపి మహేందర్ రెడ్డి హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “సాయంత్రం 7 నుంచి ఉదయం వరకు లాక్‌డౌన్‌ పీరియడ్‌గా నిర్ణయించాము. ఈ సమయంలో ప్రజలెవరూ రోడ్లపైకి రావద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. పగటిపూట కూడా కూరగాయలు, నిత్యావసరవస్తువులు కొనుగోలు చేయడానికి మాత్రమే బయటకు రావచ్చు. కానీ అది కూడా తమ ఇంటికి దగ్గరగా ఉన్న దుకాణాల వరకే అనుమతిస్తాము. ఒక్కో కుటుంబం నుంచి ఒకరి కంటే ఎక్కువ మంది బయటకు రావద్దు. కిరాణా, కూరగాయల దుకాణాలు రాత్రి 7 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచేందుకు అనుమతి ఉంటుంది. ఈ నియమనిబందనలు అతిక్రమించి ఎవరైనా రోడ్లపైకి వచ్చినట్లయితే చట్ట ప్రకారం కటినచర్యలు తీసుకొంటాము,” అని హెచ్చరించారు. 

హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలో పలు పట్టణాలలో ఈరోజు భారీ సంఖ్యలో వాహనాలు రోడ్లపైకి వచ్చాయి. ప్రజలు ఇలాగే రోడ్లపై తిరుగుతుంటే లాక్‌డౌన్‌ చేసినా ప్రయోజనం ఉండదు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడం సాధ్యం కాదు. కనుక ఈరోజు మధ్యాహ్నం నుంచి రోడ్లపైకి సరైనా కారణం లేకుండా వచ్చే వాహనదారులపై భారీ జరిమానాలు విధించాలని పోలీస్ శాఖ భావిస్తున్నట్లు సమాచారం.

Related Post