పోలీసులకు లొంగిపోయిన వెంకటేష్ గౌడ్

February 19, 2020
img

సంచలనం సృష్టించిన బ్యాంక్ ఉద్యోగిని దివ్య హత్య కేసులో నిందితుడిగా భావిస్తున్న వెంకటేష్ గౌడ్, బుదవారం సాయంత్రం వేములవాడ పోలీసులకు లొంగిపోయాడు. అతనిని పోలీసులు అదుపులో తీసుకొని గజ్వేల్ పోలీసులకు అప్పగించారు. మంగళవారం రాత్రి దివ్య హత్యచేయబడినప్పటి నుంచి అతను పరారీలో ఉన్నాడు. ఏదో ఒకరోజు పోలీసుల చేతికి చిక్కక తప్పదని గ్రహించిన వెంకటేష్ స్వయంగా వచ్చి లొంగిపోయాడు. అతనే ఈ హత్య చేశాడా లేదా? చేస్తే ఎందుకు చేశాడనేది పోలీసుల విచారణలో తేలుతుంది కనుక త్వరలోనే ఈ కేసు విచారణ ముగియవచ్చు.

దివ్య హత్య తరువాత ఈ కేసులో కొత్త విషయాలు బయటపడ్డాయి. దివ్య, వెంకటేష్ లకు వేములవాడలో పాఠశాలలో చదివేటప్పుడే పరిచయం ఏర్పడిందని, ఆ తరువాత వారిరువురూ రహస్యంగా పెళ్ళి చేసుకున్నారని, కానీ అప్పటికి ఆమె మైనర్ అవడంతో వారి పెళ్ళిని దివ్య తల్లితండ్రులు తిరస్కరించారని, అప్పటి నుంచి ఆమెను వెంకటేష్ కు దూరంగా ఉంచారని సమాచారం. 

ఆ తరువాత ఆమె ఏపీ గ్రామీణ బ్యాంకులో ఉద్యోగం సంపాదించుకొని అదే బ్యాంకులో పనిచేస్తున్న సంపత్ అనే వ్యక్తిని ప్రేమించగా ఇరు కుటుంబాల పెద్దలు వారి ప్రేమను అంగీకరించి ఈనెల 26న వారి పెళ్ళికి ఏర్పాట్లు చేస్తున్నారు. అది సహించలేని వెంకటేష్ ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్నసమయంలో ఆమెపై కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Related Post