వారంలో పెళ్ళి...అంతలో హత్య

February 19, 2020
img

మరో వారంలో ఆమెకు పెళ్ళి జరుగబోతోంది. పెళ్ళి దగ్గర పడుతుండటంతో ఆమె తల్లితండ్రులు పెళ్ళి ఏర్పాట్ల హడావుడిలో ఉన్నారు. ప్రేమించుకొని పెద్దల ఆశీర్వాదలతో త్వరలో పెళ్లిచేసుకోబోతున్న ఆ జంట కూడా ఆ శుభదినం కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. కానీ అంతలోనే ఊహించని దారుణం జరిగిపోయింది. ఆమెను ఓ గుర్తుతెలియని వ్యక్తి కత్తితో గొంతుకోసి హత్య చేసి పరారయ్యాడు. ఈ దారుణ ఘటన మంగళవారం సాయంత్రం గజ్వేల్ పట్టణంలో  లక్ష్మీప్రసన్ననగర్‌లో జరిగింది. 

పోలీసుల సమాచారం ప్రకారం..సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన న్యాలకంటి లక్ష్మీరాజ్యం, మానెమ్మ దంపతుల మూడో కుమార్తె దివ్య (25) స్థానిక ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంకులో పనిచేస్తోంది. అదే బ్యాంక్ వరంగల్‌ బ్రాంచీలో పనిచేస్తున్న సందీప్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వారి ప్రేమకు ఇరుకుటుంబాల పెద్దలు ఆమోదం తెలిపి ఈనెల 26న వివాహానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 

మంగళవారం ఉదయం దివ్య తల్లితండ్రులు పెళ్ళిపనుల కోసం ఎల్లారెడ్డిపేటకు వెళ్ళగా, దివ్య రోజూలాగే బ్యాంకుకు వెళ్ళి సాయంత్రం ఇంటికి తిరిగివచ్చి కాబోయే భర్త సందీప్‌తో ఫోన్లో కబుర్లు చెప్పుకొంటోంది. రాత్రి సుమారు 8 గంటలకు ఒక యువకుడు హటాత్తుగా ఇంట్లోకి చొరబడి కత్తితో ఆమె గొంతు కోసి పారిపోయాడు. ఫోన్లో ఆమె కేకలు విన్న సందీప్ వెంటనే గజ్వేల్‌లోని తన స్నేహితులకు ఫోన్‌ చేసి ఈ విషయం చెప్పడంతో వారు అక్కడకు వెళ్ళి చూడగా దివ్య రక్తంమడుగులో చనిపోయి కనబడింది. 

సమాచారం అందుకొన్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని ఆమె తల్లితండ్రులకు సమాచారం అందించారు. ఆమె శవాన్ని పోస్టుమార్టంకు తరలించి, కేసు నమోదు చేసుకొని నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

దివ్య తల్లితండ్రులు తెలిపిన సమాచారం ప్రకారం.. దివ్య హైస్కూల్ చదువుతున్న సమయం నుంచే వేములవాడకు చెందిన వెంకటేష్ అనే యువకుడు ఆమెను ప్రేమ పేరుతో వేదిస్తున్నాడు. దాంతో కొన్ని నెలల క్రితం స్థానిక పెద్దలకు ఫిర్యాదు చేయగా వారు అతడిని గట్టిగా హెచ్చరించి, మళ్ళీ ఆమె వెంటపడనని లిఖితపూర్వకంగా హామీ తీసుకున్నారు. తనకు దక్కవలసిన దివ్య వేరొకరిని వివాహం చేసుకోబోతోందని తెలిసి ఆగ్రహంతో రగిలిపోతున్నయిన వెంకటేష్, ఇంట్లో ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. 

వారం రోజులలో పెళ్ళిచేసి అత్తవారింటికి పంపించవలసిన తమ కుమార్తెను ఇప్పుడు వల్లకాటికి పంపించవలసి వస్తోందని ఆమె తల్లితండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆమెకు కాబోయే భర్త సందీప్, అతని తల్లితండ్రులు కూడా ఈ వార్త విని షాక్ అయ్యారు. వారు కూడా గజ్వేల్ చేరుకొని దివ్య తల్లితండ్రులను ఓదార్చారు.

Related Post