పదికోట్లు దాటిన మేడారం హుండీ కలక్షన్లు

February 19, 2020
img

వరంగల్‌ రూరల్ జిల్లా హన్మకొండలోని టీటీడీ కళ్యాణమండపంలో గత వారం రోజులుగా మేడారం జాతర హుండీ కానుకల లెక్కింపు కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖకు చెందిన 200 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. మొత్తం 494 హుండీలలో ఇప్పటివరకు 420 హుండీల లెక్కింపు పూర్తయింది. దానిలో రూ.10 కోట్లకు పైగా నగదు వచ్చింది. వాటి ద్వారా మరో కోటి రూపాయల వరకు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈసారి జాతర సమయంలో వర్షం పడటంతో కొన్ని హుండీలలో నోట్లు తడిసిపోయాయి. సిబ్బంది వాటన్నిటినీ వేరు చేసి ఆరబెట్టి లెక్కిస్తున్నారు. హుండీలలో నగదు, చిల్లర నాణేలు, విదేశీ కరెన్సీ, వెండి బంగారు ఆభరణాలను భక్తులు వనదేవతలకు కానుకలుగా సమర్పించుకున్నారు. వెండి బంగారు నాణేలు, ఆభరణాలను వేరు చేసి సిబ్బంది వాటి విలువను వేరేగా లెక్క కడుతున్నారు. మరో రెండు రోజులలో అన్ని హుండీల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది.


Related Post