తాండూరులో ఆర్టీసీ బస్సు చోరీ!

February 18, 2020
img

అవును..ఆర్టీసీ బస్సే చోరీ అయ్యింది. అది కూడా ప్రయాణికులతో ఉన్న బస్సు! ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో తాండూరు ఆర్టీసీ బస్టాండులో జరిగింది. తాండూరు డిపోకు చెందిన బస్సు(ఏపీ21జెడ్ 437) ఆదివారం రాత్రి కరణ్ కోట్ నైట్ హాల్టుకు వెళుతూ దారిలో తాండూరు బస్టాండులో నిలిపి, బస్సు డ్రైవరు, కండక్టరు భోజనానికి వెళ్ళారు. ఆ సమయంలో ఓ వ్యక్తి బస్సు ఎక్కి డ్రైవరు సీటులో కూర్చొని బస్ స్టార్ట్ చేసాడు. బస్సులో కూర్చోన్న ప్రయాణికులు అతనే బస్సు డ్రైవర్ అనుకొని ఇంకా కండక్టర్ రాలేదని చెప్పగా, “ఈ బస్సుకు నేనే డ్రైవర్...నేనే కండక్టర్..” అని చెపుతూ బస్సును బయటకు తీశాడు. కానీ కొంతదూరం వెళ్ళిన తరువాత పట్టణంలో మల్లప్పగుడి వద్ద రోడ్డుపక్కన ఆగి ఉన్న లారీనీ డ్డీ కొనడంతో అతను బస్సు దిగి పరారయ్యాడు. 

ఇంతలో భోజనం ముగించుకొని వచ్చిన బస్సు డ్రైవరు, కండక్టర్లకు బస్సు కనబడకపోవడంతో వెళ్ళి డిపో మేనేజరుకు తెలియజేశారు. బస్టాండు... పరిసరప్రాంతాలలో బస్సు కోసం ఆర్టీసీ సిబ్బంది వెతుకుతుండగా మల్లప్పగుడి వద్ద బస్సు ప్రమాదానికి గురైందంటూ బస్సులోని ప్రయాణికుల నుంచి ఫోన్‌ వచ్చింది. దాంతో డ్రైవరు, కండక్టరు, ఆర్టీసీ డిపో మేనేజర్ అందరూ హడావుడిగా అక్కడకు పరుగులు తీశారు. అక్కడ స్వల్పంగా దెబ్బ తిన్న బస్సు కనబడేసరికి అందరూ ఊపిరిపీల్చుకొని బస్సును తిరిగి డిపోకూ తీసుకువచ్చారు. 

ఆర్టీసీ బస్సు దొంగతనం గురించి బస్సు డ్రైవరు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆ వ్యక్తి కోసం గాలిస్తున్నారు. అతను బస్సును బయటకు తీస్తున్నప్పుడు మద్యం మత్తులో ఉన్నాడని ప్రయాణికులు తెలిపారు.

Related Post